గదిలోకి వెళ్లి డోర్లు మూసి వీడియో కాల్‌లోకి రా.. వృద్ధురాలికి బెదిరింపులు..


ANDRAPRADESH, ELURU: రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓటీపీలు, పాస్‌వర్డ్‌లతో మాయ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు రూటుమార్చారు. ఆధార్ నంబర్లు, పాన్ నంబర్లు దుర్వినియోగం అయ్యాయంటూ సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు చెప్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. కాలర్ ట్యూన్ల ద్వారా ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే ఏలూరు జిల్లాలో ఈ తరహాలో మోసగించే ప్రయత్నం జరిగింది.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి ఇటీవల సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అయ్యిందని.. బెంగళూరులో మీపై కేసు నమోదైందని హిందీలో బెదిరించారు. అయితే వృద్ధురాలు తనకు హిందీ అర్థం కాదని చెప్పడంతో.. పక్కనే ఉన్న మరో తెలుగు వ్యక్తి అందుకున్నాడు. మీ ఆధార్‌ కార్డుకు ఫోన్ నెంబరు లింకైందని.. దానిని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. బెంగళూరులో మీపై కేసు బుక్ చేశారని.. బెంగళూరు వచ్చి ఆధార్‌ దుర్వినియోగమైనట్లు ఫిర్యాదు చేయాలంటూ ఏవేవో చెప్పి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని.. గదిలోకి వెళ్లి డోర్లు వేసి వీడియో కాల్‌లోకి రావాలని బెదిరించారు.

దీంతో భయపడి పోయిన వృద్ధురాలు.. వెంటనే విజయవాడలోని తన కుమార్తెకు ఈ విషయాన్ని చేరవేసింది. అయితే రెండు గంటలపాటు సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో వృద్ధురాలు వీడియో కాల్‌లోకి వెళ్లింది. వీడియో కాల్‌లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ సెటప్‌ గదిలో కనిపించాడు. ఆధార్ దుర్వినియోగమైందని వృద్ధురాలిని బెదిరించాడు. మీరే బాధ్యులంటూ భయపెట్టాడు. అయితే ఈ సమయంలోనే విజయవాడ నుంచి కుమార్తె ఫోన్‌ చేయడంతో సైబర్ నేరగాళ్ల వీడియో కాల్ కట్ అయినట్లు తెలిసింది.

వృద్ధురాలి కుమార్తె సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం అందించడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వృద్ధురాలితో మాట్లాడారు. ఏమీ భయపడవద్దంటూ భరోసా ఇచ్చారు. ఏవైనా కొత్త నెంబర్ల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ వస్తే పట్టించుకోవద్దని సూచించారు. అలాగే డిజిటల్‌ అరెస్టు అంటూ ఎవరైనా బెదిరిస్తే భయపడవద్దని, తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.