INDIA NEWS: పెళ్లి పేరుతో అమాయకులను నమ్మించి, వారి జీవితాలతో ఆడుకున్న ఒక కిలాడీ మహిళను రాజస్థాన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. BY: BCN TV NEWS అత్తారింట్లో అమాయకురాలిగా, అణకువగా నటిస్తూ, ఆ ఇంట్లోని ఆస్తులు, నగదు రహస్యాలను తెలుసుకుని, ఆపై తన గ్యాంగ్ సాయంతో మొత్తం దోచుకుని ఉడాయించే ఈ మోసగత్తె పన్నాగం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు దాదాపు 25 మందిని ఇలాగే బురిడీ కొట్టించిన ఈమెను, రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి కథనాన్ని తెలుసుకుందాం.
రాజస్థాన్‌కు చెందిన అనురాధ పాసవాన్ అనే ఈ మహిళ, పెళ్లి పేరుతో అమాయక యువకులను వంచించడానికి ఒక ప్రత్యేక గ్యాంగ్‌నే నడుపుతోంది. తాను ఒంటరి మహిళనని, పేదరాలినని, ఉద్యోగం చేయని ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పుకుంటూ అందరినీ మోసం చేసేది. ఎవరి అండ లేకుండా ఒంటరిగా బతుకుతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుని అందరినీ మభ్యపెట్టేది. ఆమె గ్యాంగ్‌లోని ఒక వ్యక్తిని పెళ్లికి మధ్యవర్తిగా పంపి, సంబంధాలు కుదుర్చుకునేది. ప్రతి పెళ్లికీ కొత్త పేరు, కొత్త ఊరు, కొత్త గుర్తింపు కార్డులు ఉపయోగించి మోసానికి పాల్పడేది.
పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింట్లో చాలా అణకువగా, అమాయకురాలిగా నటించేది. అందరితో మంచిగా ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనేది. ఇలా నమ్మకం చూరగొన్న తర్వాత, ఇంట్లోని ఆస్తులు, నగదు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో, వాటి రహస్యాలు ఏమిటో తెలుసుకునేది. సరైన అవకాశం చూసి, ఒక రోజు రాత్రి భోజనంలో ఇంట్లో వారందరికీ మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయేలా చేసేది. తర్వాత తన గ్యాంగ్ సభ్యులతో కలిసి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలతో సహా పరారయ్యేది.
అనురాధ పాసవాన్ ఇప్పటివరకు 25 మందిని ఇలాగే మోసం చేసి, వారి జీవితాలతో ఆడుకుందని పోలీసులు తెలిపారు. ఈమె మోసాలు వెలుగులోకి రావడానికి కారణం మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక బాధితుడు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనురాధ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బాధితుడు మాట్లాడుతూ.. ఇటీవలే అనురాధను పెళ్లి చేసుకున్నాను. అప్పులు చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాను. వారం రోజుల్లోనే ఆమె అసలు రూపం బయటపడింది. మా ఇంట్లోని బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్‌తో సహా మొత్తం తీసుకుని పారిపోయిందని బాధితుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
సవాయి మాధోపూర్ నివాసి అయిన విష్ణు శర్మ కూడా ఇలాగే మోసపోయాడు. అతడు ఒక మధ్యవర్తికి రూ.2 లక్షలు చెల్లించి అనురాధను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల్లోనే ఆమెరూ.1.25 లక్షల విలువైన నగలు, రూ.30,000 నగదు, రూ.30,000 విలువైన మొబైల్ ఫోన్‌తో ఉడాయించింది. విష్ణు శర్మ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, గతంలో కూడా అనురాధ అనేక మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
అనురాధ మోసపూరిత వ్యూహాన్ని అర్థం చేసుకున్న సవాయి మాధోపూర్ పోలీసులు, అదే తరహాలో ఒక ప్రణాళికను రచించారు. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను పెళ్లి కాని యువకుడిలాగా మారువేషంలో పంపారు. మోసాల గ్యాంగ్‌లోని మధ్యవర్తి ఒకరి ద్వారా అనురాధ ఫోటోను ఆ కానిస్టేబుల్‌కు చూపించి, పెళ్లి సంబంధం కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసులు ఆమెను భోపాల్‌లో చాకచక్యంగా పట్టుకున్నారు.
విచారణలో ఆమె ఉపయోగించిన అన్ని డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. అనురాధ వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందినది. గతంలో ఒక ఆసుపత్రిలో పనిచేసిన ఆమె, కుటుంబ కలహాల కారణంగా తన భర్త నుంచి విడిపోయి భోపాల్‌కు మారింది. అక్కడే వివాహ మోసాలకు పాల్పడే ఒక క్రిమినల్ గ్యాంగ్‌తో చేరింది. ఈ గ్యాంగ్ స్థానిక ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. వారు వాట్సాప్ ద్వారా పెళ్లి కూతురు ఫోటోలను చూపించి, వారి సేవలకు రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తారు. పెళ్లి అయిన కొన్ని రోజుల్లోనే వధువు విలువైన వస్తువులతో ఉడాయించేది.
పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్ అర్జున్ వంటి అనేక మంది ఇతర నిందితులను కూడా గుర్తించారు. విష్ణు శర్మ ఇంట్లో నుండి పారిపోయిన తర్వాత, అనురాధ భోపాల్‌లో గబ్బర్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని అతని నుండి కూడా రూ.2 లక్షలు దోచుకున్నట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి.