INDIA NEWS: మీరు చదివే ఈ ఉదంతం ఏ కొత్త సినిమాలోని సన్నివేశం కాదు. అలా ఎందుకు చెబుతున్నారు? అని మీరు అడగొచ్చు. అందులో తప్పేం లేదు. By: BCN TV NEWS ఎందుకంటే.. ఇలాంటి ఘటనలు జరుగుతాయా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. భారతదేశంలో హిందూ - ముస్లింల మధ్య ఉన్న అద్భుతమైన మత సామరస్యానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే.. ఫూణెలోని వాన్ వాడీ ప్రాంతంలో ఉన్న అలంకారణ్ లాన్స్ లో రెండు వివాహ వేదికలు ఉన్నాయి.
తాజాగా ఓపెన్ గ్రౌండ్ లో హిందూ మతానికి చెందిన కొత్త జంట పెళ్లి వేడుక జరుగుతోంది. ఇదే ప్రాంగణంలోని బ్యాంకెట్ హాట్ లో ముస్లిం జంట రిసెప్షన్ జరుగుతోంది. ఓపెన్ గ్రౌండ్ లో పెళ్లి వేడుకకు అన్ని సిద్ధం చేయగా.. సరిగ్గా ముహుర్తం వేళకు కాస్త ముందుగా భారీ వాన మొదలైంది. దీంతో అక్కడ ఉన్న వారికి ఏం చేయాలో తోచని పరిస్థితి. కాసేపు వెయిట్ చేసిన తర్వాత పెళ్లి వేడుక చేద్దామని భావించినా.. వర్షం మాత్రం ఆగని పరిస్థితి.
ఇలాంటి వేళ.. తమ పెళ్లిని బ్యాంకెట్ హాల్ లో చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని హిందూ జంట కుటుంబ సభ్యులు ముస్లిం జంట ఫ్యామిలీని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. రిసెన్షన్ జరుగుతున్న వేదికను ఖాళీ చేసి ఇవ్వటమే కాదు.. హిందూ జంట పెళ్లి వేడుకకు అవసరమైన ఏర్పాట్లకు సాయం చేశారు. దీంతో.. రెండు కుటుంబాల వారి వివాహ వేడుకలు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయి. ఇక్కడే మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇరు కుటుంబాలు కలిసి విందును అస్వాదించటంతో పాటు.. కొత్త జంటలు కూడా ఒకే స్టేజ్ మీద కలిసి ఫోటోలు దిగారు. ఈ సన్నివేశాన్ని చూసిన రెండు కుటుంబాలు మాత్రమే కాదు.. రెండు పెళ్లిళ్లకు వచ్చిన బంధువులు.. స్నేహితులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఒకే పెళ్లి మండపం మీద.. అప్పటివరకు ఏ మాత్రం పరిచయం లేని హిందూ - ముస్లిం కుటుంబాలు కలిసి పెళ్లి చేసుకునేలా అడ్జెస్టు కావటమే కాదు.. వేర్వేరు పెళ్లి వేడుకల్ని ఒకే టైంలో పూర్తి చేయటం చూస్తే.. ఇలాంటివి భారత్ లో మాత్రమే జరుగుతాయని చెప్పకతప్పదు. మతసామరస్యానికి నిలువెత్తు రూపంగా ఈ పెళ్లి వేడుకను చెప్పకతప్పదు. వీలైతే.. ఈ రెండు జంటల్ని.. కుటుంబాల్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించుకొని అభినందించాల్సిన అవసరం ఉంది. వీలైతే..ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ లో ప్రస్తావించేందుకు అర్హత ఉన్న అంశంగా దీన్ని చెప్పొచ్చు. మరేం జరుగుతుందో చూడాలి.