అన్నదాత పథకంలో 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖిభవ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని,అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారని ఆరోపించారు. 47 లక్షల మందికే పథకం వర్తింప జేస్తారట, ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయమే అన్నారు. వడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదన్నారు. తల్లికి వందనం పథకం కింద కోతలేనని, 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే..67 లక్షల మందికే ఇచ్చారని గుర్తుచేశారు. 20 లక్షల మందికి మోసం చేశారన్నారు. మహాశక్తి పథకాన్ని మోసం చేశారని, ఎన్నికల ముందు 15 వందలు P4 కింద లింక్ పెడతాం అని ఎందుకు చెప్పలేదని షర్మిల నిలదీశారు. ఇంత వరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదన్నారు.
మరోవైపు ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదని, జగన్ కి పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే తీసుకుంటారని షర్మిల విమర్శించారు. బీజేపీ మీద విమర్శ చేసే ఉద్యమాల జోలికి వెళ్ళరని, బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయడని అన్నారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రమని, పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్ లో సీనియర్లు ఎవరు కూడా నిరుత్సాహం గా లేరని, ఎటువంటి వర్గ పోరు లేదని తెలిపారు. అందరికి కలుపుకొని పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi