ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమిలోకి జగన్ వస్తారన్న ప్రచార నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు దేశంలో గతంలో ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ ప్రధాని మోడీ చేస్తున్న ప్రచారంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సహజ సంపదను దోచుకు తిన్నారని, కులమతాల మధ్య చిచ్చు పెట్టారని షర్మిల గుర్తుచేశారు. మణిపూర్,గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా అని ప్రధాని మోడీని షర్మిల ప్రశ్నించారు. ఆ ఎమర్జెన్సీ తో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టును మోడీ నిర్వీర్యం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్ లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడని వైసీపీ, కూటమి పార్టీల ఎంపీలను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పని చేస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రమని షర్మిల తెలిపారు. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీకి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ఎటువంటి ఆంక్షలు లేవని,కాంగ్రెస్ పార్టీ మీదే ఆంక్షలు అమలు చేస్తున్నారని కూటమి సర్కార్ పై షర్మిల విమర్శలు చేశారు. వైసీపీ కార్ల కింద జనాలకు తొక్కుతున్నా అన్ని అనుమతులు ఇస్తారని, తమ పోరాటాలకు మమ్మల్ని హౌజ్ అరెస్ట్ లు చేస్తారన్నారు.వినే వాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారన్నారు. వైసీపీ కూడా ఇలాగే సింగయ్య హత్య గురించి చెప్తుందన్నారు. వివేకా హత్య మీద మాట మార్చారని, ఇప్పుడు సింగయ్య ది ఏఐ గ్రాఫిక్ అంటున్నారన్నారు.