ఇటీవలే రికాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆందోళనకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. రెండో దశ ఈ నెల 4 నుంచి 12 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్ధాయిలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం జులై 13 నుంచి 20 వరకు మండల లేదా డివిజన్ స్ధాయి, జులై 21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామస్ధాయిలో దీన్ని నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు జగన్ ఇదివరకే ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా యువజన విభాగాన్ని యాక్టివేట్ చేయనున్నారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా నేడు ఆ విభాగం సభ్యులతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
యువజన విభాగం కొత్త కమిటీ ఏర్పాటైన తరువాత వైఎస్ జగన్.. వారితో సమావేశం కాబోతోండటం ఇదే తొలిసారి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసన సభ్యుడు జక్కంపూడి రాజా నియమితులయ్యారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కొనసాగుతున్నారు. నంద్యాల జిల్లాకు ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా.. మెంటాడ స్వరూప్ కుమార్- శ్రీకాకుళం, మేరుగు చందన్ నాగ్- ప్రకాశం, రేగం చాణక్య- అల్లూరి సీతారామరాజు, షేక్ షఫీవుల్లా- వైఎస్ఆర్ కడప నియమితులయ్యారు.
జోనల్ అధ్యక్షులుగా.. అంబటి నాగ వినాయక శైలేష్ (అంబటి శైలేష్)- విశాఖపట్నం, దాడిశెట్టి శ్రీనివాస్- కాకినాడ, కల్లం హరికృష్ణ రెడ్డి- గుంటూరు, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి- ప్రకాశం, పిట్టా హేమంత్ రెడ్డి- చిత్తూరు, ఎల్లారెడ్డిగారి ప్రణయ్ రెడ్డి- అనంతపురం అపాయింట్ అయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా.. కొంగర మురళీ కృష్ణ- అల్లూరి సీతారామరాజు, గౌరా శ్రీహరి- కృష్ణా, దండమూడి రాజేష్- ఎన్టీఆర్, గాలివీటి వివేకానందరెడ్డి- అన్నమయ్య రాయచోటి, కోటగిరి సందీప్- ఏలూరు, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి- నెల్లూరు, పలిశెట్టి సురేష్ రాజ్ కుమార్- అనకాపల్లి, కండ్రేగుల సీహెచ్ అచ్యుతరామారెడ్డి- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ నియమితులయ్యారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ వారికి దిశా నిర్దేశం చేస్తారని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. కిందటి నెల 23వ తేదీన నిర్వహించిన యువత పోరు వంటి ఆందోళనలను మరింత విస్తృతంగా చేపట్టేలా మార్గదర్శనం ఇస్తారని అంటోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi