ANDHRAPRADESH:పండగ సీజన్ లల్లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
తాజాగా సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) నుంచి కర్ణాటకలోని అరసికెరెకు 33 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. ఏపీ మీదుగా సికింద్రాబాద్- అరసికెరె, హైదరాబాద్- అరసికెరె మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్- అరసికెరె..
ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6:05 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07079 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు అరసికెరెకు చేరుకుంటుంది.
ఈ నెల 14 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అరసికెరె నుంచి బయలుదేరే నంబర్ 07080 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:45 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, తుమకూరు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్- అరసికెరె..
ఈ నెల 8వ నుంచి 26వ తేదీ వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 6:20 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07069 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు అరసికెరెకు చేరుకుంటుంది.
ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అరసికెరె నుంచి బయలుదేరే నంబర్ 07070 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:50 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది
సికింద్రాబాద్, కాచిగూడ, ఊందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, తుమకూరు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
నేడు కాచిగూడ నుంచి తిరుపతికి..
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేడు కాచిగూడ నుంచి తిరుపతి ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లనుంది.
ఈ రాత్రి 11:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07676 ప్రత్యేక రైలు మరుసటి రోజుద మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది
Shakir Babji Shaik
Editor | Amaravathi
