ANDRAPRADESH:ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాల పైన టీడీపీ ప్రజల్లోకి వెళ్లింది. ఈ కార్యక్రమానికి బీజేపీ - జనసేన దూరంగా ఉన్నాయి. జగన్ లక్ష్యంగా టీడీపీ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. జగన్ కౌంటర్ గా కూటమి ని టార్గెట్ చేస్తూ తన పార్టీ నేతలను ప్రజల్లోకి పంపారు. ఇదే సమయంలో జిల్లా పర్యటనలకు జగన్ సిద్దమయ్యారు. కాగా, పీసీసీ చీఫ్ షర్మిల తన అన్న జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగి స్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ జగన్ - షర్మిల ఒకే వేదిక మీదకు రానున్నారు.
అధినేత జగన్...పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నిక ల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. షర్మిల తన ఎన్నికల ప్రచారం లో జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా కూటమి కంటే జగన్ పైనే ఎక్కువ గా షర్మిల టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. కాగా ఇద్దరి మధ్య ఆస్తుల వ్యవహారాల పైన పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. కాగా, ఈ నెల 8న వైఎస్సార్ 75వ జయంతి. ఆ రోజున తమ తండ్రికి నివాళి అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్...పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఇప్పుడు జగన్ ముందుగా పార్టీ ప్రక్షాళన పైన కసరత్తు చేస్తున్నారు. జల్లాల పర్యటనలకు నిర్ణయించారు.
ఈ నెల 8న వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు జగన్ ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం షర్మిల ఇడుపుల పాయకు చేరుకుంటారని సమాచారం. ఇద్దరు కలిసి నివాళి అర్పిస్తారా..వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తల్లి విజయమ్మ సైతం ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొననున్నారు. ఇక జగన్ 9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మామిడి రైతులను పరామర్శించేందుకు కార్యక్రమం ఖరారైంది. ఇక, జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు వీలుగా షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతోంది. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ వచ్చే వారం పరామర్శించాలని నిర్ణయించారు.
ఇక, ఈ నెల మూడో వారం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లా కమిటీలను వచ్చే వారం నియమించేలా కసరత్తు జరుగుతోంది. ఇక, వైఎస్సార్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు వైసీపీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సైతం వైఎస్సార్ జన్మదినం నిర్వహించనుంది. ఇప్పుడు జగన్ - షర్మిల కుటుంబ సభ్యులతో పాటుగా ఇడుపులపాయకు వస్తుండటంతో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi