జగన్ నెల్లూరు పర్యటన వేళ చివరి నిమిషంలో, ఉత్కంఠ..!!


ANDHRAPRADESH:మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన ఉత్కంఠగా మారుతోంది. జగన్ నెల్లూరు పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లా వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ వస్తుంటే జనం వచ్చి తీరుతారని చెబుతున్నారు. జగన్ పర్యటన కోసం భారీ జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన ప్రారంభం వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో, నెల్లూరులో జగన్ పర్యటన పైన ఆసక్తి నెలకొంది.

మాజీ సీఎం జగన్ ఈ రోజు నెల్లూరులో పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు అనుమతులు ఇస్తూనే పోలీసులు ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్‌ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్‌కు ముగ్గురు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరో వైపు పోలీసుల ఆంక్షలున్నప్పటికీ భారీ జన సమీకరణకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.

కావలి, ఉదయగిరి, ఆత్మకూరుల నుంచీ జనాన్ని తీసుకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్ జైలులో ఉన్న గోవర్ధన్‌రెడ్డిని కలిసేందుకు, తర్వాత ఆయన కుటుంబ సభ్యుల ను పరామర్శించేందుకు ఈ నెల 3వ తేదీనే నెల్లూరుకు జగన్‌ రావాల్సి ఉంది. హెలిపాడ్ అనుమతి విషయంలో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అప్పట్లో పోలీసులు చూపిన స్థలంలోనే ప్రస్తుతం హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. జైలు నుంచి బయల్దేరి నెల్లూరులో సుమారు 8 కిలో మీటర్లు రోడ్డుమార్గంలో వైఎస్ జగన్‌ ప్రయాణించనున్నారు. జైలుకు వెళ్లి కాకాణిని కలవనున్న జగన్‌, తర్వాత సుజాతనగర్‌లోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుంటారు. దీంతో, జగన్ పర్యటన వేళ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. అటు వైసీపీ నేతలు జగన్ కోసం జనం భారీగా వస్తారని చెబుతున్న వేళ ఈ పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now