ఆయన నటిస్తూనే నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. అలా పార్టీ పెట్టి తొమ్మిది నెలలలోనే సీఎం అయిపోఅయరు.
ANDHAPRADESH:మాటకు వస్తే తనకు పాలనా అనుభవం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజానికి ఆయన ఈ మాట గత పదేళ్ళుగా అంటూ వచ్చారు. అయితే పవన్ ఇపుడు ప్రతిపక్షంలో లేరు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏడాదికి పైగా అధికారంలో ఉన్నారు. పాలనాపరంగా ఎంతో కొంత అనుభవం సంపాదించే ఉన్నారు.
అయినా సరే ఆశ్చర్యకరంగా ఆయన ప్రకాశం జిల్లా సభలో మాట్లాడుతూ తనకు పాలనా అనుభవం లేదని చెప్పి తన అభిమానులను, అనుచరులను పార్టీ వారిని నిరాశపరచారు అన్న చర్చ సాగుతోంది. మరో వైపు ఒక బలమైన సామాజిక వర్గం దశాబ్దాలుగా సీఎం పదవిని చేపట్టాలని చూస్తోంది. వారికి పవన్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అయితే పవన్ మాత్రం తనకు అలాంటి ఆశలు లేవని పరోక్షంగా చెప్పదలచారా అన్నదే చర్చగా ఉంది.
ఇదిలా ఉంటే పవన్ సినీ సీమ నుంచే వచ్చి ఎకాఎకీన సీఎంలు అయి జనరంజకంగా పాలించిన వారి లిస్ట్ కూడా చాలా పెద్దదే తమిళనాడులో ఎంజీఆర్ అన్నా డీఎంకే స్థాపించి 1977లో ముఖ్యమంత్రిగా తొలిసారి అయ్యారు. ఆయన సీఎం సీటుని అధిరోహించేవరకూ మంత్రి కూడా కాదు, అంతే కాదు చట్ట సభలలో ఏ విధంగానూ కూడా పనిచేయలేదు.
అయినా తమిళనాడులో ఎంజీఆర్ పాలన అంటే స్వర్ణ యుగం అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన ప్రజలకు ఎంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు పేదలంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే వారి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇక ఎన్టీఆర్ విషయమే తీసుకుంటే ఆయనకు కూడా ఎలాంటి పాలనానుభవం లేదు.
ఆయన నటిస్తూనే నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. అలా పార్టీ పెట్టి తొమ్మిది నెలలలోనే సీఎం అయిపోఅయరు. ఇక ఏపీలో సంక్షేమం అంటే అన్న గారే గుర్తుకు వస్తారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యుడి కోణంలో నుంచే ఆలోచించేవారు. అందుకే ఆయన గతించి మూడు దశాబ్దాలు అవుతున్నా ఈ రోజుకీ ప్రజల గుండెలలో శాశ్వతంగా కొలువు తీరారు.
ఇక తమిళనాట జయలిత తీసుకుంటే ఆమె నాలుగు సార్లు సీఎం అయ్యారు. తమిళ ప్రజలకు అమ్మగా ఆమె చిర కీర్తిని ఆర్జించారు. ఆమె కూడా మంత్రి పదవి సైతం నిర్వహించలేదు. కానీ 1991లో తొలిసారి సీఎం అయ్యారు. అలా ఆమె ప్రజాభిమానాన్ని నిండుగా చూరగొనెలా పాలన చేశారు. ఉక్కు మహిళగా తమిళనాడు హిస్టరీలో తన పేరుని నిలుపుకున్నారు.
ఇక అదే తమిళనాడులో కొత్తగా టీవీకే పేరుతో పార్టీ పెట్టిన దళపతి విజయ్ కూడా సీఎం అవుతాను అని అంటున్నారు. ఆయన రెండేళ్ళ క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన తన సభలలో ఏ రోజూ తనకు పాలనానుభవం లేదని చెప్పలేదు. తనకు ఒక చాన్స్ ఇస్తే అద్భుతంగా పాలిస్తాను అని అంటున్నారు. తాను సీఎం గా ఉంటూ ప్రజలకు ఏమి చేయాలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా ఆయన ఇప్పటి నుంచే రెడీ చేసి పెట్టుకున్నారు.
ఇక ఇవన్నీ చూసినపుడు పవన్ కళ్యాణ్ నాకు పాలనానుభవం లేదు అంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనక అర్ధాలు ఏమిటి అనే అంతా చర్చిస్తున్నారు. ఉత్తమ పరిపాలకుడికి ఉండాల్సింది మంచి మనసు, మేలు చేయాలన్న నిబద్ధత అవి ఉంటే చాలు పరిపాలన బ్రహ్మాండగా చేస్తారు అన్నది అనేక సార్లు నిరూపణ అయింది.
ఇక రాజ్యాంగంలో కూడా పాలనానుభవం ఉంటేనే తప్ప పదవులు చేపట్టరాదూ అని రూల్స్ ఎవరూ పెట్టలేదు. మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేందుకు వయో పరిమితిని, విద్యార్హతలను కూడా విధించలేదు. ఎవరైనా అగ్ర స్థానం ఎక్కవచ్చు. వారికి సహాయంగా ఉండేందుకే ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదివిన అధికారులతో ఒక వ్యవస్థను కూడా ఉంచారు.
అందువల్ల పాలసీ డెసిషన్స్ అయినా మరోటి అయినా సమిష్టిగా తీసుకునేలా మన రాజ్యాంగం ఒక ఉత్తమ వ్యవస్థను రూపొందించింది. ఇవన్నీ చూసినపుడు పరిపాలకుడికి ఉండాల్సింది అనుభవం కంటే కూడా నిబద్ధత అని చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైన పవన్ కళ్యాణ్ తనకు అనుభవం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi