ANDHRAPRADESH:రాయలసీమలో గతేడాది ఎన్నిక్లలో అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న తెలుగు దేశం పార్టీకి ఆధిపత్య పోరు మాత్రం తప్పడం లేదు. స్థానికంగా ఉన్న ఆధిపత్య పోరు కారణంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ శబరిపైనా టీడీపీ సీరియస్ అయింది.
రెండు రోజుల క్రితం శ్రీశైలం పర్యటనకు వచ్చిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత అయిన ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయడం ఏంటని ఎంపీ శబరిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గం సీరియస్ అయింది. అక్కడితో ఆగకుండా బుడ్డా వర్గం కార్యకర్తలు ఏరాసు ఇంటిపై దాడులకు దిగారు. ఎంపీ శబరి అక్కడే ఉన్న సమయంలో రాళ్ల దాడి చేసి అద్దాల్ని ధ్వంసం చేశారు.
దీంతో ఆ తర్వాత జరగాల్సిన మరో కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఎంపీ శబరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఏరాసు ప్రతాపరెడ్డి తన ఇంటిపై బుడ్డా వర్గం చేసిన దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్త చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఎంపీ, ఎమ్మెల్యే సమన్వయం లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్న టీడీపీ హైకమాండ్.. వీరిద్దరినీ క్రమశిక్షణ కమిటీ విచారణకు రావాలని నోటీసులు పంపింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటికే నంద్యాల జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య పలుమార్లు ప్రోటోకాల్ సమస్యలు చోటు చేసుకున్నాయి. నంద్యాల ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పలు సందర్భాల్లో ప్రోటోకాల్ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి శ్రీశైలం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పట్టాయి. దీంతో టీడీపీ క్రమశిక్షణా కమిటీ విచారణ తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi