తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫిర్యాదు
శాసనమండలి సభ్యురాలైన తనపైన శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, గౌరవ చట్టసభల సభ్యుడిగా ఉన్న మల్లన్న ప్రజా ప్రతినిధి అయిన తనపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రెండేళ్లుగా తాను ఉద్యమిస్తున్నట్టు తెలిపారు.
బీసీ రిజర్వేషన్ ల కోసం తెలంగాణా జాగృతి ఉద్యమాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఢిల్లీ వేదికగా బీసీ గొంతుకు గా తను నిలిచానని రిజర్వేషన్లు కల్పించాల్సినదేనిని తన గొంతును బలంగా వినిపించానని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శాసనమండలిలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రెండు వేరువేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాం
ఈ బిల్లు చట్ట రూపం దాల్చడానికి ఆలస్యం అవుతున్న తరుణంలో ఢిల్లీ వేదికగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేశామని ఆమె లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకువచ్చామని ఆమె తెలిపారు.
తనపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు
తమ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర క్యాబినెట్ బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిందని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం లో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న తన పైన మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు.
సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి?
చట్టసభల సభ్యురాలినైన నాపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే సమాజంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ఆమె తన లేఖలో ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసనమండలి లోని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని 262-c సబ్ రూల్ 1 కింద కోరుతున్నానని ఆమె తన ఫిర్యాదు లేఖలో వెల్లడించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi