HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్ కు.. రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు భారీగా తేడా ఉన్న నేపథ్యంలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని భూముల విలువను తెలంగాణ ప్రభుత్వం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, ఆస్తుల విలువను హేతుబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొన్ని చోట్ల 100 నుంచి 400 శాతం మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరల హెచ్చుతగ్గులను అధ్యయనం చేసిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. భూముల ధరల పెంపుపై స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టారు. భూముల ధరల్లో పలు సవరణలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే త్వరలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కొత్త మార్కెట్ విలువలను కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినకుండా ఏటా భూముల విలువను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్లాట్ ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30 శాతం, స్థలాల విలువ 1 నుంచి 4 శాతం పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. భూముల మార్కెట్ విలువలో సవరణలు చేస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ వచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో గతంలో ఉన్న ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారు. అంతేకాక తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కొత్త సవరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. కొత్త సవరణ బిల్లులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వారికి స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi