HYDERABAD:భారత్ రాష్ట్ర సమితి మైనారిటీ విభాగం నేడు సమావేశం కానుంది. త్వరలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దీనికి అవసరమైన కసరత్తు చేపట్టనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు.
జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సొంత నియోజకవర్గం. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఆయన స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంపై బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది.
ఈ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు జెండా పాతింది బీఆర్ఎస్. 2018 ఎన్నికల్లో మాగంటి భారీ మెజారిటీతో గెలిచారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్ ను 16 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు.
అదే జైత్రయాత్రను ఈ ఉప ఎన్నికలో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉండే నియోజకవర్గం ఇది. ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్, రహ్మత్ నగర్, షేక్ పేట్ వంటి డివిజన్లు దీని పరిధిలోకి వస్తాయి.
ఈ నేపథ్యంలో ఈ సారి మైనారిటీ అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక సహా.. ఇతర అంశాలపై చర్చించడానికి బీఆర్ఎస్ మైనారిటీ విభాగం ఈ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానుంది. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, ఇతర సీనియర్ నాయకులు దీనికి హాజరు కానున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi