శత్రువులు ఎక్కడో ఉండరు... చెల్లెళ్ళ రూపంలో ఇంట్లోనే ఉంటారు”!


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రాలుగా విడిపోయినా మిగిలిన ఏ విషయంలోనూ విడిపోలేదనే చెప్పొచ్చు.

HYDERABAD:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రాలుగా విడిపోయినా మిగిలిన ఏ విషయంలోనూ విడిపోలేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు మద్రాస్ తో ఆంధ్రులకు ఎలాంటి సంబంధం ఉండేదో అంతకంటే ఎన్నో రెంట్లు ఎక్కువ అనుబంధం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడూ కొనసాగుతోంది! దీంతో.. ఇరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రెండు కుటుంబాలు, అందులోని ఆడపడుచులకు సంబంధించిన ఆసక్తికర చర్చ హాట్ టాపిక్ గా మారింది

అవును... రాజశేఖర్ కుమార్తె షర్మిల, చంద్రశేఖర్ కుమార్తె కవిత లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి! ఉమ్మడి రాష్ట్ర రాజకీయంలో వైఎస్సార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు.. తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ లేకుండా ఊహించలేమని కొంతమంది చెబుతారు. అలాంటి ఉద్దండులకు వీరు ముద్దుల కుమార్తెలు!

ఇదే సమయంలో.. వీరిద్దరూ నోరు మాట్లాడటం మొదలుపెడితే.. తమ తండ్రుల గురించే మాట్లాడతారు. వీరిద్దరికీ వారిద్దరే హీరోలు. వీరి రాజకీయ భవిష్యత్తుకు వారే అన్నీ! వారి వారి తండ్రుల పేర్లే వీరి బలాలూ, బలగాలు! కట్ చేస్తే... ఇద్దరికీ వారి వారి అన్నలే విలన్లు! ఇన్ని సమపోలికలు ఉన్న వీరికి రాజకీయంగా ఓ అతిపెద్ద వ్యత్యాసం ఉంది! 

అదేమిటంటే... తండ్రి హీరో, అన్న విలన్, ఇద్దరి భర్తల పేర్లు అనీల్! ఈ పోలీకల సంగతి పక్కనపెడితే... తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ పాత్రతో పాటు కవిత పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. ఇద్దరూ ఎవరి స్థాయిలో వారు పోరాడారు! తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ప్రజలను జాగృతం చేసిన చరిత్ర కవిత కు ఉంది.

అయితే.. టీఆరెస్స్ (ప్రస్తుత బీఆరెస్స్) అభివృద్ధిలో కవిత కంటే కేటీఆర్ పాత్ర కాస్త ఎక్కువని చెబుతుంటారు! ప్రధానంగా రెండోసారి అధికారంలోకి రావడంలో! అయితే.. పదవుల విషయంలో కవితకు తండ్రి కేసీఆర్ అయినా, అన్న కేటీఆర్ అయినా ఉన్నంతలో మంచి గౌరవమే ఇచ్చారని చెబుతారు. ఆమె ఎంపీగా పనిచేశారు. టర్వాత ఓటమి పాలైతే ఎమ్మెల్సీ ఇచ్చారు!

ఉన్నంతంలో ఆమెకు రాజకీయ పదవులు, అధికారిక ప్రోటోకాళ్లు దూరం కాకుండానే చూసుకున్నారు కేసీఆర్, కేటీఆర్ అని చెబుతారు! ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం అయితే బీఆరెస్స్ కు, కేసీఆర్, కేటీఆర్ లకు పెద్ద తలనొప్పులే తెచ్చిపెట్టిందని చెబుతారు!

కట్ చేస్తే... వైసీపీ విజయంలో, జగన్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి చెల్లెల్లు షర్మిల సుమారు 16నెలలు పార్టీకి చేసిన సేవ గొప్పదనే చెప్పాలి! నాడు ఆమె ఆ స్థాయిలో ధైర్యం చేసి ముందుకు సాగకపోతే.. పార్టీకి పునాదుల సమయంలోనే ఊహించని స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యేవని చెబుతారు! అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు దక్కింది ఏమిటి? 

వారి వ్యక్తిగత కుటుంబ అస్తుల సంగతి కాసేపు పక్కనపెడితే.. జగన్ ఆమెకు ఎలాంటి పదవులూ ఇవ్వలేదు! అయితే... పదవులన్నీ ఇంట్లో వాళ్లే తీసుకోకూడదని వైసీపీ వాళ్లు సమర్థించుకున్నా... షర్మిలకు ఎలాంటి పదవి ఇచ్చినా అది ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరానికీ అవకాశం ఇవ్వదు! జగనన్న వదిలిన బాణంపై ఆమెకు ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఐడెంటిటీ ఉంది!

దీంతో.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి, ఇప్పుడు అదే పార్టీకి ఏపీ చీఫ్ గా ఉన్నారు! ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక హస్తం గుర్తు తోనే అని ఆమె ఫిక్సైనట్లు కనిపిస్తున్నారు. తన తండ్రి వైఎస్సార్ - కాంగ్రెస్ పార్టీ.. వేరు వేరు కాదనేది ఆమె మాటగా వినిపిస్తుంటుంది! కవిత మాత్రం తమ నాయకుడు కేసీఆరే అని చెబుతున్నారు! 

ఇలా పైకి ఇద్దరి పరిస్థితి ఒకటే అన్నట్లుగా పైకి కనిపిస్తున్నా.. ఇద్దరి గతం పూర్తి వైవిద్యం, ప్రస్తుతానికి కనిపిస్తున్న రాజకీయ భవిష్యత్తు విభిన్నం అనే చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. 

ఆ సంగతి అలా ఉంటే... ఇక వీరిద్దరి అన్నల విషయానికొస్తే... వారి వారి రాజకీయాలకు చెల్లెల్లు కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నారనే చెప్పాలి! ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నారనే అంటారు! 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవ్వడానికి షర్మిల మాత్రమే కారణం కాకపోవచ్చు కానీ... ఆమె కూడా ఒక కారణం అని చెప్పి తీరాలనేది చాలా మంది అభిప్రాయం!

పైగా... ఆమె అధికార కూటమి ప్రభుత్వంపై పోరాటం అని చెబుతున్నాప్పటికీ... ప్రధానంగా జగన్ పైనే ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ, వ్యక్తిగత పోరాటం అనేది సుస్పష్టం! ఈ విషయంలో ఆమె ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటారు.. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లొని సమీకరణలు మారేవరకూ! 

ఇక కవిత విషయానికొస్తే... వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఆమె ఎలాంటి అడ్డు అనేది ఆసక్తికర విషయం! వచ్చే ఎన్నికల్లో బీఆరెస్స్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మాత్రమే సీఎం అనేది అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు చెబుతున్నారు. కాకపోతే టాప్ 2 కేటీఆర్ అని అంటున్నారు. ఇక్కడే కవిత కు సమస్య అనే విశ్లేషణలు వినిపిస్తుంటాయి!

ఈ నేపథ్యంలోనే... జగన్, కేటీఆర్ ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడుకున్నా.. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడినా.. వారిద్దరూ "అ ఆ" సినిమాలోని ... "శత్రువులు ఎక్కడో ఉండరన్నా... చెల్లెళ్ళ రూపంలో ఇంట్లోనే ఉంటారు!" అని చెప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు! ఇది (ప్రస్తుతానికి) వారి విషయంలో అయితే నిజమేనా? లేక, డైలాగ్ రివర్సా..??
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now