హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?


2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దినెలలుగా ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. యూసీసీ అమలుపై భారత లా కమిషన్ ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.


భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో యూసీసీ అమలు కోసం అక్కడి ప్రభుత్వం ఒక ప్యానెల్‌ని కూడా నియమించింది. ఈ ప్యానెల్ త్వరలోనే నివేదిక అందజేయనుంది.

జూన్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా యూసీసీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ''ఒక ఇంట్లో ఒక చట్టం ఉండాలా? లేక ఇంట్లో ఒక్కో వ్యక్తికి ఒక్కో చట్టం ఉండాలా? అలా ఉంటే ఇల్లు సక్రమంగా నడుస్తుందా?'' అని ఆయన కార్యకర్తలను అడిగారు.

తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేయడాన్ని కూడా మోదీ గొప్పగా ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని 2017లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. దాని తర్వాత ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి దాన్ని నేరంగా పరిగణించింది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, ఇంకా జరిమానా విధిస్తూ 2019లో కొత్త చట్టాన్ని తెచ్చింది.

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడంపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ, ఈ చట్టంలో మహిళలకు ఎలాంటి ఆర్థిక సాయం గురించి ప్రస్తావించలేదు. దీంతో అది ముస్లిం స్త్రీలను వారి భర్తలు విడిచిపెట్టడానికి పరోక్షంగా కారణమవుతోంది.

ఫ్యామిలీ చట్టాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావడమే యూసీసీ లక్ష్యం. అంటే, పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం, వ్యక్తిగత చట్టాలన్నింటినీ కలిపి, మతాలతో సంబంధం లేకుండా ఒకే చట్టం పౌరులందరికీ వర్తించేలా చేయడం.

అయితే, ఈ కొత్త చట్టం ఎలా ఉండబోతోందనేందుకు ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఎన్నో వ్యత్యాసాలున్న వేర్వేరు మతాలకు చెందిన వారందరికీ ఒకే చట్టం ఎలా వర్తిస్తుందని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

''హిందూ, ముస్లిం చట్టాలు పూర్తిగా భిన్నమైనవి, చాలా తేడాలున్నాయి'' అని దిల్లీకి చెందిన ఫ్యామిలీ లాయర్ మాళవిక రాజ్‌కోటియా అన్నారు.

ఆ తేడాలను ఎలా అధిగమిస్తారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒక మతానికి సంబంధించిన చట్టాలు మరొకరిపై రుద్దుతారా? లేదంటే అందరికీ వర్తించేలా యూనిఫాం కోడ్ ద్వారా ప్రభుత్వం మరో మార్గాన్ని అన్వేషిస్తుందా?

హిందూ, ముస్లిం చట్టాల గురించి ఇక్కడ చూద్దాం.


పెళ్లి, విడాకులు
హిందూ చట్టం ప్రకారం, సంప్రదాయబద్దమైన పవిత్ర కార్యం వివాహం. కానీ, ముస్లిం చట్టం ప్రకారం ఇరువర్గాలు అంగీకరించి చేసుకున్న ఒక ఒప్పందం. వాటిని అనుసరించే విడాకుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. హిందూ వివాహ చట్టంలోని ఒక ప్రకరణ ప్రకారం వివాహాలు ఒప్పందానికి సమానమేనని నిపుణులు చెబుతున్నారు.

''వధువు, వరుడు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు హిందూ వివాహ చట్టం కొన్ని అర్హతలను నిర్దేశించింది'' అని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫ్యామిలీ లా నిపుణులు సరసు ఎస్తేర్ థామస్ చెప్పారు. ''దానికి అనుగుణంగానే విడాకుల చట్టం నిబంధనలు పొందుపరిచారు. అందువల్ల హిందూ వివాహ చట్టం స్వభావం కూడా మతపరమైనది కాదు''.

వివాహ స్వభావంలో తేడాలు ఉండడమే కాకుండా, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయంలోనూ రెండు మతాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. హిందూ చట్టంంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ వేర్వేరు కులాల్లో వేర్వేరు పద్ధతులు, నియమాలు పాటిస్తుంటారు.

అలాగే, రక్త సంబంధీకులు, మేనమామ, మేనకోడళ్లతో వివాహాలు హిందూ చట్టం ప్రకారం నిషేధమైనప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మరీముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇది కనిపిస్తుంది.

ముస్లిం చట్టం ప్రకారం, తండ్రి తరఫున లేదా తల్లి తరఫున రక్త సంబంధీకులను వివాహం చేసుకోవచ్చు.

ముస్లింలలో వివాహాలను ఒక ఒప్పందంగా పరిగణించడం వల్ల విడాకులు కూడా సులభంగా తీసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ హక్కుపై కూడా పితృస్వామ్య ప్రభావం ఉంది. ట్రిపుల్ తలాక్ చట్టం విరుద్ధమైనప్పటికీ, ఏకపక్షంగా విడాకులు తీసుకునేందుకు ముస్లిం చట్టంలో మరికొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, వాటిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.

దత్తత లేదా గార్డియన్
హిందూ చట్టం ప్రకారం దత్తత తీసుకున్న బిడ్డకు కూడా సొంత బిడ్డ మాదిరిగానే అన్ని ప్రయోజనాలూ వర్తిస్తాయి. ఇస్లామిక్ చట్టంలో దత్తత తీసుకునేందుకు అవకాశం లేదు. అయితే, 2015లో వచ్చిన సెక్యులర్ జువైనల్ జస్టిస్ యాక్ట్‌తో బిడ్డను దత్తత తీసుకునేందుకు అవకాశం కలిగింది.

గార్డియన్‌(సంరక్షకులు)గా ఉండే విషయంలోనూ రెండు చట్టాల్లో వ్యత్యాసాలున్నాయి. హిందూ చట్టం ప్రకారం, మగపిల్లాడికి లేదా పెళ్లికాని ఆడపిల్లకు తండ్రి గార్డియన్ అవుతారు. వివాహం కాకుండా సంతానం కలిగినప్పుడు తల్లి వారికి గార్డియన్ అవుతారు.

ముస్లిం చట్టంలో గార్డియన్ విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. జాతీయ లా కమిషన్ ప్రకారం, గార్డియన్‌ను నిర్ణయించే సమయంలో పిల్లల ఇష్టానికి ప్రాధాన్యం ఉంటుంది.


వారసత్వం...
యూనిఫాం కోడ్ విషయంలో వారసత్వమే అతిపెద్ద సవాల్. హిందూ చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉమ్మడి కుటుంబంలోని పిల్లలకు వారసత్వ ఆస్తులపై పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ, ఆస్తులు కూడా ఉమ్మడిగా ఉంటే ఈ మినహాయింపు ఉంటుంది.

ఇప్పుడు ఆ ప్రయోజనాలను అన్ని మతాల వారికి వర్తింపజేస్తారా? లేదంటే హిందూ చట్టంలో ఉన్న ఈ మినహాయింపును ప్రభుత్వం రద్దు చేస్తుందా? ఈ పన్ను మినహాయింపులను రద్దు చేసిన ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడి ప్రభుత్వం 1975లో ఈ మినహాయింపులను రద్దు చేసింది.

భారత లా కమిషన్ కూడా హిందూ చట్టం ప్రకారం లభిస్తున్న పన్ను మినహాయింపులు పన్నుల ఆదాయంపై భారీగా ప్రభావం చూపుతున్నాయని, వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేసింది.

దానితో పాటు వారసత్వం విషయంలో రెండు చట్టాల్లోనూ చాలా తేడాలున్నాయి. ''వారసత్వం విషయంలో హిందూ, ముస్లిం చట్టాల్లో చాలా తేడా ఉంది'' అని రాజ్‌కోటియా చెప్పారు. వారసులకు లభించే హక్కుల విషయంలో తేడాలున్నాయని ఆమె అన్నారు.

ముస్లిం లా ప్రకారం వారసుడికి వచ్చే ఆస్తిలో సగం మాత్రమే వారసురాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే అది, అందులోని సున్నీ, షియా లాంటి వేర్వేరు చట్టాలను అనుసరించి ఉంటుంది. అందులోని వేర్వేరు చట్టాల్లో వారసుల వాటాలు వేర్వేరుగా ఉన్నాయి. సున్నీ చట్టం ప్రకారం 12 మంది క్లాస్ -1 వారసులు ఉన్నారు. వారిలో సోదరులు, సోదరీమణులకు ఆస్తి పొందే హక్కు ఉంది.

2005కి ముందు వరకూ హిందూ చట్టంలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదు. వారసత్వ ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉండేది కాదు. అలాగే, పెళ్లైనప్పటికీ మగపిల్లలకు ఆస్తిలో హక్కు ఉంటుంది కానీ, పెళ్లైన ఆడపిల్లలకు ఉండేది కాదు.

అలాగే, ఒక మహిళకు చెందిన ఆస్తిపై ఆమె తల్లిదండ్రుల కంటే ముందు, భర్త ద్వారా కలిగిన సంతానానికే ప్రాధాన్యం ఉంటుంది.

03:11 PM
ఒకే మతంలో వర్గాల మధ్య తేడాలు
హిందూ, ముస్లిం మతాల్లోని భిన్నవర్గాల విశ్వాసాల మధ్య వ్యత్యాసాలను అధిగమించడం మరో సవాల్. ''హిందూ చట్టంలో వాటి గురించి ఎక్కువగా పొందుపరచలేదు'' అని డాక్టర్ థామస్ చెప్పారు.

'' హిందువుల్లో ద్రవిడ, మితాక్షర, దయాభగ వంటి వేర్వేరు ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల ప్రకారమే విభజన, ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. అలాగే వివాహాలు, ఇతర అంశాలకు కూడా ఆ ఆచారాలు వర్తిస్తాయి''.

ముస్లింలలో కూడా సున్నీలు, షియాలు వంటి వేర్వేరు వర్గాలు ఉన్నాయి. వివాహాలు, కుటుంబ విషయాల్లో ఈ రెండింటి మధ్య కూడా వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు సున్నీలు హనాఫి లేదా మాలికి వంటి సంప్రదాయాలను అనుసరిస్తారు.

''ఈ చట్టాలన్నింటినీ సవరించడం, వాటిని సమన్వయం చేయడం చాలా పెద్ద పని'' అని రాజ్‌కోటియా అభిప్రాయపడ్డారు.


న్యాయపరమైన సవాళ్లు
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే చట్టాన్ని బట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించిన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

యూసీసీని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లా కమిషన్‌కు లేఖ రాసింది. కుటుంబ వ్యవహారాలు కచ్చితంగా మత గ్రంథాల ద్వారా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం నిర్దేశితమని, ఏ మతాన్ని అనుసరిస్తారనేది పౌరుల ప్రాథమిక హక్కు అని వాదించింది.

వాటితో పాటు ''ఈ చట్టాలకు సవరణలు చేయడం, ప్రజల సాంస్కృతిక గుర్తింపునకు కూడా విరుద్ధంగా ఉండొచ్చు'' అని రాజ్‌కోటియా చెప్పారు. రాజ్యాంగంలోని 29వ ఆర్టికల్ ప్రకారం మైనారిటీలకు వారి వైవిధ్యమైన సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది. ఇప్పుడున్న చట్టాలను సవరిస్తే, ''పెను మార్పు'' అవుతుందని ఆమె అన్నారు.

యూసీసీ రాజ్యాంగం అందించిన వివక్షపై వ్యతిరేకతకు సంబంధించిన వ్యవహారాలకు కూడా విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

''అందరికీ ఒకే చట్టం వర్తించేలా చేయడం ద్వారా ఒక వర్గానికి సంబంధించిన నిబంధనలను మరో వర్గానికి కూడా అన్వయిస్తే, అది వివక్షతో కూడిన ఆధిపత్యానికి కారణమయ్యే అవకాశం ఉంది'' అని రాజ్యాంగ నిపుణులు తరుణాబ్ ఖైతాన్ అన్నారు.