Hyderabad: ఏపీలో తమ మద్దతు వైసీపీకే ఉంటుందని ఓవైసీ చెప్పారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. అక్కడ వైసీపీని, జగన్‌ను గెలిపించాలని మైనారిటీ ముస్లింలకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే ముస్లింలకు రక్షణ ఉంటుందని చెప్పారు. అత్యంత లౌకిక నాయకుడు ఎవరైనా ఉంటే అది జగనేనని వ్యాఖ్యానించారు. జగన్‌ను వదులుకుంటే..ఏపీలో ముస్లింలు బతకలేరని చెప్పారు. ఎన్డీయే కూటమి ఏపీలో విజయం దక్కించుకుంటే.. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్‌లను రద్దు చేస్తారని హెచ్చరించారు.
తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఓవైసీ.. ఏపీలో తమ మద్దతు వైసీపీకే ఉంటుందని చెప్పారు. 2019లోనూ వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు కల్పించింది జగనేనని చెప్పారు. రేపు కూటమి ప్రభుత్వం వస్తే.. ఇవన్నీ బీజేపీ లాగేసుకుంటుందని ఓవైసీ హెచ్చరించారు. "జగన్‌ను నేను గమనించాను. ఆయన అత్యంత లౌకిక వాది. ఆయన తీరుతో ముస్లింలకు మేలు జరిగింది. అనేక పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయనను వదులుకోవద్దని మేం పిలుపునిస్తున్నాం.'' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో టీడీపీ అధినేత, కూటమి నేత చంద్రబాబుపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక రాజకీయ అవకాశవాది అని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు ఎ వరితో అవసరం ఉంటే.. వారితో తిరుగుతుంటారని చెప్పారు. "విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు. విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్. ఏపీ ప్రజలు విశ్వసనీతయ వైపే ఉంటారని భావిస్తున్నాం. రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే.. ముస్లింలకు రిజర్వేషన్లు లేకుండా పోతాయి. ఈ విషయంలో ముస్లింలు అప్రమత్తంగా వ్యవహరించాలి" అని ఓవైసీ పిలుపునిచ్చారు.