జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి


ఏలూరు జిల్లా, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలో ఆగష్టు, 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారుల ఇంటివద్దే పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చెప్పారు. ఆగష్టు, 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  

ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాట్లను సీఎస్ కు కలెక్టర్ వెట్రి సెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆగష్టు, 1వ తేదీ ఉదయం 6 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, 1వ తేదీనే 90 నుండి 95 శాతం మేర పెన్షన్లు పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. పెన్షన్ల పంపిణీకి గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని, అదనపు సిబ్బందిగా వివిధ శాఖలలోని జూనియర్ అసిస్టెంట్, తదితర సిబ్బంది సేవలు వినియోగిస్తున్నామన్నారు. అదనపు సిబ్బందికి బయో మెట్రిక్ యంత్ర పరికరం వినియోగంపై శిక్షణ అందించడం జరిగిందన్నారు. గిరిజన మండలాల్లో పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
                     
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎటువంటి అలసత్వం లేకుండా నిర్వహించాలన్నారు. ఆగష్టు, 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణీ నమోదు కావాలన్నారు. మొదటి రోజే 90 నుండి 95 శాతం మేరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు.   
         
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. విజయరాజు, ఏలూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.