INDIA NEWS: కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంట్ లో ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. దాదాపు 73 పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలకమైన ప్రశ్నలు వేసింది.
వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. ఇందులో వినియోగం ఆధారంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే నిబంధన తొలగింపుపై సూటిగా ప్రశ్నించింది. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను కూడా కోర్టు ప్రస్తావించింది. ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డులలో భాగం కావడానికి కూడా కేంద్రం అనుమతిస్తుందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరుల్ని చేర్చేందుకు వీలుగా చట్టాన్ని కేంద్రం సవరించిన నేపథ్యంలో అలాగే హిందూబోర్డుల్లోనూ ముస్లింలకు ప్రవేశం కల్పిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే సుప్రింకోర్టులో కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వివరణ తీసుకునేందుకు సమయం కోరారు. అలాగే సుప్రీంకోర్టు అడిగిన మరికొన్ని ప్రశ్నలపైనా కేంద్రం వివరణ తీసుకుని జవాబు ఇస్తానని తెలిపారు.
మరోవైపు పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. కొత్త చట్టం కలెక్టర్‌కు ఇచ్చే అధికారాలను కూడా సిబల్ ప్రశ్నించారు. కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగమని, ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. అనంతరం సుప్రీంకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.