ANDRAPRADESH: మిన్ను విరిగి మీద పడుతుంటే.. ఎవరైనా అలెర్ట్ అవుతారు. అంతర్గత చర్చలద్వారానో.. తప్పులు సరిచే సుకోవడం ద్వారానో తమను తాము సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఘనత వహించిన వైసీపీ నాయకులు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎదురు దాడి చేయడం.. తప్పించుకునే పన్నాగాలు పన్నడంలోనేవైసీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీకి ఉచ్చు బిగిస్తోంది.
మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మార్చడంలోను, ప్రజలను దోపిడీ చేయ డంలోనూ కీలకంగా వ్యవహరించిన వారి ఆనుపాన్లను సర్కారు గుర్తిస్తోంది. అరెస్టులు చేస్తోంది. విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇక, ముంబైకి చెందిన నటి జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును కూడా.. సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను ఉద్దేశ పూర్వకంగానే ఏపీకి తీసుకువచ్చి.. ఇబ్బంది పెట్టారని.. కేసులు పెట్టారని కూడా గుర్తించారు.
ఈ క్రమంలోనే సీతారామంజనేయులును జైలుకుకూడా పంపించారు. ఇంత జరుగుతున్నా.. వైసీపీలో ఎక్కడా మార్పు రావడం లేదు. పైగా.. ఎదురు దాడి.. పరనిందల ప్రోగ్రామ్స్‌లోనే నాయకులు ఆరితేరు తున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర, పథకాలనుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆడుతున్న ఆట.. అంటూ.. వైసీపీ నాయకులు.. వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు సహా.. పలువురు నాయకులు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే.. ఇప్పటికే.. `కీలక నేత` చుట్టూ ఉచ్చు బిగిస్తున్న దరిమిలా.. వాస్తవాలను గ్రహించడంలో వైసీపీ నాయకులు వెనుకబడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంకా ఏవో భ్రమల్లోనే బతుకుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. వాస్తవాలను గుర్తించకపోతే... ప్రజలు సైతం ఛీత్కరించుకుంటారన్న విషయం.. గత ఎన్నికల్లోనే రుజువైంది. అయినా.. వైసీపీ నాయకులు మాత్రం మారకపోవడం గమనార్హం. ఎవరికి వారు.. ఇంకా భ్రమల్లోనే ఉంటే.. ప్రజలు ఆ భ్రమల నుంచి ఎప్పుడో బయట పడ్డారని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే.. పాప క్షమాపణ దక్కుతుందని చెబుతున్నారు.