WORLD NEWS: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారతదేశ పర్యటన ఖరారైంది. సతీమణి ఉషా వాన్స్ (Usha vance)తో కలిసి ఇటలీ, భారత్‌లను సందర్శించనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జేడీ వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఆయన సతీమణి ఉషా వాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారనే విషయం తెలిసిందే.
ఇటలీ, భారత్ పర్యటనలో భాగంగా ఆయా దేశాల నేతలతో వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై జేడీ వాన్స్ చర్చలు జరుపుతారని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం వెల్లడించింది. భారత పర్యటనలో భాగంగా వాన్స్ కుటుంబం ఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శించనుంది. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననుంది.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. భారత్ - అమెరికా వాణిజ్య చర్చల వేళ జేడీ వాన్స్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు భారత్ సహా అన్ని దేశాలపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. కాగా, వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి అమెరికాలోనే పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆమె పూర్వీకులది ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉష ఒకరు.
యేల్ లా స్కూల్‌లో జేడీ వాన్స్, ఉషా తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి.. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. జేడీ వాన్స్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఉష కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా వాన్స్ తమ పూర్వీకుల దేశమైన భారత్ రావడం ఆసక్తిగా మారింది. ఈ పర్యటనలో వారి తల్లిదండ్రులకు సంబంధించిన పూర్వీకులను కూడా కలిసే అవకశం ఉన్నట్లు తెలుస్తోంది.