ఈ క్రమంలో ఆయన సామాజిక వర్గాలను దగ్గరకు తీయాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ANDHRAPRADESH:వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జోరు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలతో నెలకు రెండు సార్లు జనంలోకి వస్తున్న జగన్ తనకు లభిస్తున్న ఆదరణను చూసుకుంటూ మరింత దూకుడు చేయాలని పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
రానున్న రోజులలో ప్రాంతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని కీలక సామాజిక వర్గాలతో భేటీలు వేయాలని జగన్ ఒక మాస్టర్ ప్లాన్ ని రచించారు అని అంటున్నారు 2024 ఎన్నికల్లో వైసీపీకి దాదాపుగా 40 శాతం ఓటు షేర్ దక్కింది. దానికి కారణం వైసీపీని అట్టేబెట్టుకుని ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీ వర్గాల ఓట్లే అని వైసీపీ అధినేత విశ్లేషించుకుంటున్నారు.
అయితే రేపటి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ఓటు షేర్ సరిపోదని కూడా భావిస్తున్నారు 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీకి దూరంగా ఉన్న వివిధ సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కూడా భావిస్తున్నారుట. ఈ క్రమంలో ఆయన సామాజిక వర్గాలను దగ్గరకు తీయాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక చూస్తే కనుక వైసీపీ పాలనలో ఎక్కువగా కొన్ని సామాజిక వర్గాలనే ఫోకస్ చేయడం పదవుల నుంచి అన్నీ వారికే ఇవ్వడంతో పాటు వారికే పధకాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడంతో మిగిలిన సామాజిక వర్గాలు దూరం అయ్యాయని వైసీపీ అంచనా వేసుకుంటోంది. ప్రభుత్వం అంటే అందరిదీ అన్న భావన కలిగించాల్సిన సమయంలో గత సారి కొన్ని పొరపాట్లు జరిగాయని వైసీపీ పెద్దలు విశ్లేషించుకుంటున్నారుట.
అందువల్ల ఈసారి అలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు వారి విశ్వాసం పొందేందుకు స్వయంగా జగన్ ప్రాంతీయ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాలతో నేరుగా మాట్లాడుతారు అని అంటున్నారు. రానున్న రోజులలో ఈ తరహా ప్రాంతీయ సదస్సులు ఉంటాయని చెబుతున్నారు.
ఈ క్రమంలో అగ్ర వర్ణాల వారు అయిన రెడ్డి కాపు, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వర్గాలతో జగన్ చర్చిస్తారు అని అంటున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యులతో జగన్ నేరుగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని తమ పార్టీ తరఫున వారికి ఏమి చేయగలమన్నది కూడా చెబుతారని అంటున్నారు.
ఇక కాపులతో సమావేశాలకు రాజమండ్రీని వేదికగా ఎంచుకుంటున్నారు. కమ్మలతో సమావేశాలకు గుంటూరు ని వేదికగా చేసుకుంటున్నారు వైశ్యులతో సమావేశాలను విజయవాడలో నిర్వహిస్తారుట. అలాగే రెడ్డి సామాజిక వర్గంతో సమావేశాలను తిరుపతిలో నిర్వహిస్తారని అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంతో సమావేశాలను విశాఖలో నిర్వహించి వారి సమస్యలను స్వయంగా జగన్ అడిగి తెలుసుకుంటారని అంటున్నారు.
ఈ సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటే వైసీపీకి మరింత గెలుపు భరోసా దొరుకుతుందని భావిస్తున్నారుట. అంతే కాదు అర్బన్ ఏరియాలలో వైసీపీ బాగా వీక్ గా ఉంది. దాంతో అక్కడ బలపడేందుకు కూడా ఈ తరహా సమావేశాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. తొందరలోనే ఈ ప్రాంతీయ భేటీలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్ ఏ విధంగా మెటీరియలైజ్ అవుతుందో.

Shakir Babji Shaik
Editor | Amaravathi