ఉచిత బస్సులో భారీ మార్పులు...సక్సెస్ రేటు అక్కడే

ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుల విషయంలో కొత్తగా మార్పు చేర్పులు చేయాలని విధివిధానాలను మర్చాలని చూస్తోంది అని అంటున్నారు.

ANDHRAPRADESH:ఉచిత బస్సుని ఆగస్టు 15వ తేదీ నుంచి రోడ్ల మీదకు తేనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయనే ప్రకటించాక ఇక ఉచిత బస్సు జనంలోకి వచ్చేందుకు కౌంట్ డౌన్ మొదలైనట్లే. అయితే చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేసినా అనుకున్న స్థాయిలో అయితే స్పందన రాలేదని అంటున్నారు. దానికి కారణం ఈ బస్సుని కేవలం కొత్త జిల్లాల పరిధికే పరిమితం చేయడం.

ఎన్నికల ముందు అయితే రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటకలో తెలంగాణాలో అదే విధానం అమలు అవుతోంది కాబట్టి ఏపీలో కూడా తుచ తప్పకుండా అలాగే చేయాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే ఏపీ ఖజానా అందుకు అనుమతించే పరిస్థితి లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉచిత బస్సు ఎపుడూ అని విపక్షాలు విమర్శలు పెద్ద ఎత్తున గుప్పించడం వల్ల ప్రభుత్వం ఉన్నంతలో ఏదో విధంగా హామీని నెరవేర్చాలని తాపత్రయంతో జిల్లాల వరకే ఉచిత బస్సు అని ప్రకటించింది.

అయితే ఇది అమలు చేసినా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాదని అంటున్నారు. మహిళల కోసం అని చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అంతే కాదు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల పరిధిలో ఒక చోట నుంచి వేరే చోటకు వెళ్ళాలంటే పది నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటుంది. దీంతో ఆక్యుపెన్సీ కూడా పెద్దగా ఉండదని మహిళా ప్రయాణికులు కూడా అంతగా ఆసక్తి చూపించరని అంటున్నారు. 

ఇదిలా ఉంటే మరో వైపు వైసీపీ అయితే ఇది ఒక మోసం అని అంటోంది. 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మహిళలకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వంటి వారు విమర్శిస్తున్నారు. రాష్ట్రమంతా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఇపుడు మాట మార్చి జిల్లాలకే పరిమితం చేయడమేంటని ఆయన మండిపడ్డారు.

వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతూ ప్రభుత్వం తీరు మీద చేస్తున్న విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఈ ఇష్యూని తీసుకుంది అని అంటున్నారు. దాంతో ప్రభుత్వం ఈ విషయంలో వేరే ఆలోచనలు చేస్తోదని అని అంటున్నారు. 

ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుల విషయంలో కొత్తగా మార్పు చేర్పులు చేయాలని విధివిధానాలను మర్చాలని చూస్తోంది అని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పరిధిని కొత్త జిల్లాలకు కాకుండా పాత ఉమ్మడి జిల్లాలకు పెంచడం ద్వారా మహిళల నుంచి మెప్పు పొందవచ్చు అని ఆలోచిస్తున్నారుట. అంటే పాత ఉమ్మడి పదమూడు జిల్లాలలో అయితే ఈ పధకం సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. 

అపుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళాలీ అంటే కచ్చితంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అలా ప్రయాణం ఉచితం చేస్తే సంతృప్తి కరంగా ఉంటుందని ఆక్యుపెన్సీ రేటు కూడా పెద్ద ఎత్తున ఉంటుందని సూచనలు వస్తున్నాయట. దాంతో తొందరలో దీని మీద విధానాలు ఖరారు చేస్తారు అని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలలో ఉచిత బస్సు అంటే కనుక విజయవంతం అవుతుందని మహిళలలో కూడా బాగా స్పందన ఉంటుందని ఆశిస్తున్నారు.

 

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now