జగన్ అంటే జనం అనే విషయం మరోసారి నిరూపితమయింది: భూమన కరుణాకర్ రెడ్డి

జగన్ బంగారుపాళ్యం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుందని భూమన విమర్శ

బంగారుపాళ్యంలో హిట్లర్ నాటి నాజీ పాలన కనిపించిందని మండిపాటు

వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేసి భయోత్పాతం సృష్టించారన్న భూమన

ANDHRAPRADESH:మామిడి రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకు వస్తే, ప్రభుత్వం హిట్లర్ కాలం నాటి నాజీ పాలనను తలపించేలా వ్యవహరించిందని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నించిందని, భయానక వాతావరణం సృష్టించిందని ఆయన ఆరోపించారు. 

మామిడి రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ బంగారుపాళ్యం వస్తే, కూటమి ప్రభుత్వం భయపడిపోయిందని భూమన అన్నారు. "మా నాయకులకు నోటీసులు ఇచ్చారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. బంగారుపాళ్యం వెళ్లే అన్ని దారుల్లో అడ్డంకులు సృష్టించారు. అయినా జగన్ అంటే జనం అని మరోసారి నిరూపితమైంది. గుట్టలు, కొండలు దాటుకుని ప్రజలు, రైతులు జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ జన ప్రవాహం చూశాక కూటమి ఓటమి ఖరారైంది" అని ఆయన జోస్యం చెప్పారు.

జగన్ పర్యటన ఒక సెట్టింగ్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను భూమన ఖండించారు. జగన్ పర్యటన ఖరారైన తర్వాతే ప్రభుత్వం కిలో మామిడికి రూ.6 ఇచ్చేందుకు ముందుకొచ్చిందని, అంతకుముందు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. దగా పడ్డామన్న ఆవేదనతో వచ్చిన రైతులు, తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్లపై మామిడికాయలు పారబోసి తమ కడుపుమంటను వెళ్లగక్కారని భూమన తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని ఆయన పేర్కొన్నారు. 

 

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now