ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తవుతోంది. సూపర్ సిక్స్ తో పాటుగా పలు పథకాల పైన ఎన్నికల సమయం లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగా కొన్ని అమలు ప్రారంభించారు. ఈ నెల లోనే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు జరుగుతోంది. ఆగస్టు 15 నుంచి మహిళల కు ఉచిత బస్సు ప్రారంభం కానుంది. ఇదే సమయంలో మరో కీలకమైన పథకం అమలు.. దరఖా స్తుల స్వీకరణ.. విధి విధానాల పైన ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.
మరో హామీ అమలు
ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా హామీల పైన కసరత్తు కొనసాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ 4 వేలకు పెంచి ప్రతీ నెలా ఒకటో తేదీన అందిస్తోంది. ఉచిత గ్యాస్ ఏటా మూడు సిలిండర్ల నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తల్లికి వందనం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అమలుకు సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక, ఇప్పుడు మరో హామీ అమలుకు ఫోకస్ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన 'ఎన్టీఆర్ విదేశీ విద్య' పథకాన్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు ప్రారంభించింది.
విధి విధానాలు
ఎన్నికల హామీ ప్రకారం దీనికి సంబంధించి త్వరలో విధివిధానాల రూపకల్పన చేయాలని యోచిస్తోంది. మంత్రి డోలా బాలవీరాంజ నేయస్వామి ఇప్పటికే విదేశీ విద్యకు సంబంధించి సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించి 4,923 మంది విద్యార్థులకు రూ.364 కోట్లు ఖర్చు చేసింది. విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా ఈ పథకాన్ని అమలు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించారు. ఇక, విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో దీని అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అర్హతల పై
గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన రీతిన ఎక్కువ దేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అర్హత దక్కేలా విధివిధానాలను రూపొందించనున్నారు. ప్రతి ఏటా రెండుసార్లు జూలై, నవంబర్ నెలల్లో దరఖాస్తులు స్వీకరించి.. విదేశాల్లో కొత్త కోర్సులు చదువుకునేందుకు వెళ్లే పేద విద్యార్థులకు ఆర్థిక అండ అందించాలని యోచిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను ఖరారు చేయనుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi