ANDHRAPRADESH:ఏపీలో వైఎస్ జగన్ పేరు చెబితేనే మండిపడే టీడీపీ నేతల జాబితాలో దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. ఆయన మరోసారి ఇవాళ వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు పేర్ని నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు. పేర్ని, ప్రసన్న మాటలు జగన్ మనసులోనివే అంటూ దేవినేని విమర్శించారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, అలాగే పేర్నినాని తాజాగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఇప్పుడు ఇబ్బందిపెడుతున్న టీడీపీ నేతలపై తాము అధికారంలోకి వచ్చాక రప్పా రప్పా అంటూ సైలెంట్ గా వేసెయ్యాలంటూ చేశారని చెబుతున్న వ్యాఖ్యల్ని దేవినేని ఉమ ఖండించారు. సోదరి వరసయ్యే మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని జగన్ ఖండించకుండా సమర్థించారని దేవినేని ఆరోపించారు. జగన్ అంతరంగంలో ఉన్న మాటలే కదా పేర్నినాని, ప్రసన్నకుమార్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయని విమర్శించారు.
పేర్ని నానిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దేవినేని కోరారు. మరోవైపు విజయసాయిరెడ్డి ఇవాళ చేసిన కర్మఫలం ట్వీట్ పైనా దేవినేని స్పందించారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య గొంతుకోసినందుకే కదా ఇవాళ ఈ దుస్దితి పట్టిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బోంబే స్టాక్ ఎక్చేంజ్, ప్రధాని కార్యాలయానికి లేఖలు రాసి పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారని, అయినా చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని దేవినేని గుర్తుచేశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi