ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చెప్పాల్సింది చెప్పేశారు.
ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక మీదట మరో ఎత్తు అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అంటే మంత్రులను మార్చడం ఖాయమని కూడా చెబుతున్నారు. అయితే ఆ లిస్ట్ ఏమిటి ఎంతమంది ఉంటారు అన్నదే ఇపుడు సర్వత్రా సాగుతున్న చర్చ. కొత్త మంత్రుల మీద బాబు అసహనంగా ఉన్నారు అన్నది ఇప్పటిదాకా ప్రచారంగా ఉంది కానీ కొందరి సీనియర్ల విషయంలోనూ బాబు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే మంత్రి మండలిలో ఆ ఇద్దరు సీనియర్ మంత్రుల మీద చర్చ సాగుతోంది అని అంటున్నారు. నిజానికి ఆ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం టీడీపీలో ఉన్న వారికి చాలా మందికి ఇష్టం లేదని చెప్పుకున్నారు. అయితే ఇచ్చిన మాట మేరకు బాబు వారికి న్యాయం చేశారు అని అంటున్నారు. ఆ ఇద్దరే కొలుసు పార్ధసారధి, ఆనం రామనారాయణ రెడ్డి అని అంటున్నారు.
ఈ ఇద్దరూ అయిదేళ్ళ పాటు వైసీపీలో ఉంటూ చివరి నిముషంలో టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు. అంతే కాదు మంత్రులు కూడా అయ్యారు. కొలుసు పార్ధసారధి విషయానికి వస్తే కాంగ్రెస్ లో మంత్రి అయ్యారు. వైఎస్సార్ మీద ప్రేమతో జగన్ పార్టీలో చేరారు. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటే దక్కలేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారు.
దానికి దృష్టిలో పెట్టుకునే బాబు ఆయనకు న్యాయం చేశారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన ఆనం రామనారాయణ రెడ్డి విషయం కూడా అంతే అని అంటున్నారు. కాంగ్రెస్ లో ఆర్థిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూసిన ఆనం కి వైసీపీలో సాధారణ ఎమ్మెల్యేగా ఉంచడం నచ్చలేదు. దాంతో ఆయన కూడా తగిన హామీతో టీడీపీలోకి వచ్చారు.
ఈ ఇద్దరికీ బాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అదే సమయంలో అయిదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తిని ఆయా జిల్లాల తమ్ముళ్ళు వ్యక్తం చేశారు అయితే ఇపుడు ఎటూ మంత్రి పదవులలో మార్పు చేర్పులు ఉంటే కనుక ఈ ఇద్దరి సంగతి ఏమిటి అన్నదే అంతా చర్చిస్తున్నారు.
ఈ మధ్యనే నెల్లూరులో మంత్రి లోకేష్ సమక్షంలోనే జరిగిన ఒక సభలో మంత్రి ఆనం తన అసంతృప్తిని వేరే రూపంలో వెళ్ళగక్కారు అని అంటున్నారు. సాటి మంత్రి నారాయణ మీద ఆయన పరోక్ష కామెంట్స్ చేశారు అని అంటున్నారు. తనకు పెద్దగా ప్రాధాన్యత లేని దేవాదాయ శాఖను కట్టబెట్టారని ఆనం వారికి ఆవేదనగా ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే కొలుసు పార్ధసారధి చేతిలో కీలకమైన సమాచారం గృహ నిర్మాణ శాఖలు ఉన్నా ఆయన దూకుడు చేయలేకపోతున్నారు అన్నది కూడా కూటమి పెద్దలలో ఉందిట. స్వతహాగా సొమ్యుడు అయిన పార్ధసారధి వైసీపీని విమర్శిస్తున్నారు కానీ ఆ డోస్ చాలదని అంటున్నారు. ఆనం వారు అయితే మౌనం గానే ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో సీనియర్లలో ఈ ఇద్దరు మంత్రులకు చెక్ పెడతారా లేక శాఖలు మారుస్తారా అన్న చర్చ అయితే సాగుతోందిట.

Shakir Babji Shaik
Editor | Amaravathi