ఇంటర్ విద్యార్థి ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు
విజయనగరం కుర్రాడు సిద్ధూకు పవన్ కల్యాణ్ అభినందన
తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించిన యువకుడు
విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కిన ఉప ముఖ్యమంత్రి
3 గంటల ఛార్జింగ్‌తో 80 కిలోమీటర్ల ప్రయాణం
ANDHRAPRADESH:సాధారణ విద్యార్థిలోని అసాధారణ ప్రతిభకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముగ్ధులయ్యారు. వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చిన ఓ యువకుడిని ప్రత్యేకంగా అభినందించి, ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. కేవలం ప్రశంసలతో సరిపెట్టకుండా, ఆ విద్యార్థి తయారుచేసిన సైకిల్‌పై అతడిని కూర్చోబెట్టుకుని స్వయంగా తొక్కి ఉత్సాహపరిచారు.
విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధూ అనే ఇంటర్ విద్యార్థి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ఇంటి నుంచి కళాశాలకు వెళ్లేందుకు పడుతున్న ప్రయాణ కష్టాలను అధిగమించేందుకు, అతడు సొంతంగా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. ఈ సైకిల్‌ను కేవలం మూడు గంటలు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సిద్ధూ వివరించాడు.
సిద్ధూ ప్రతిభ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్, అతడిని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సిద్ధూ ఆలోచనలను, ఆవిష్కరణల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అతడి ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ, ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. దీంతో పాటు సిద్ధూ రూపొందించిన 'గ్రాసరీ గురూ' వాట్సప్ సర్వీస్ బ్రోచర్‌ను కూడా చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. యువ ఆవిష్కర్తను పవన్ ప్రోత్సహించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi