కేవలం 2,456 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై బూచేపల్లి విజయం సాధించారు.
ANDHRAPRADESH:ఒక నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే.. చాలానే కష్టపడాలి. పైగా.. ప్రతిపక్షంలో ఉంటే.. ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొంటూనే.. సిన్సియర్ పాలిటిక్స్ చేస్తూ.. మా మంచి ఎమ్మెల్యే అనే పేరు తెచ్చుకుంటున్నారు.. దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వాస్తవానికి 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్న బూచేపల్లి ఫ్యామిలీ.. 2024లో మాత్రం పట్టుబట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కూటమి హవాను తట్టుకుని.. అతి కష్టం మీద విజయం దక్కించుకున్నారు
కేవలం 2,456 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై బూచేపల్లి విజయం సాధించారు. నిజానికి ఈ విజయం చాలా ఉత్కంఠకు సైతం గురి చేసింది. ఓట్ల లెక్కింపు నుంచి ముగిసే వరకు కూడా.. ప్రతి ఓటూ.. చాలా కీలకంగా మారింది. ఇక, ఏడాది కాలంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది..అనేది ఆసక్తికరం. వాస్తవానికి బూచేపల్లి ప్లాన్.. వైసీపీ అధికారంలోకి వస్తుంది.. మంత్రి పదవిని దక్కించుకోవాలని భావించారు. కానీ, వైసీపీ అధికారంలోకి రాలేదు. అయినా.. ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు.
స్థానికంగా దర్శి మునిసిపాలిటిలో ఎమ్మెల్యే మాతృమూర్తి బూచేపల్లి వెంకాయమ్మ అధికారంలో ఉండడం తో ఆయనకు కొంత మేరకు పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి, ఇతర అంశాలను పక్కన పెడితే.. పారిశుద్ధ్యం, చెత్త ఎత్తే కార్యక్రమాలు, రహదారుల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. నిరంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతోనూ భేటీ అవుతున్నారు. ఇక్కడ కలిసి వచ్చిన అంశాలు రెండు ఉన్నాయి. ప్రధానంగా ప్రత్యర్థి పక్షం తరఫునగళం వినిపించే నాయకులు ఎవరూ లేరు.
అంటే.. ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకునే నాయకులు, ఆయనపై విమర్శలు చేసేవారు ఎవరూ లేకపోవడం బూచేపల్లికి ప్లస్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆమె పార్టీలో కూడా ఉన్నారో లేదో తెలియదు. ఇక, వైసీపీ నుంచి గత ఎన్నికల తర్వాత.. టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా.. నోరు విప్పడం లేదు. నిజానికి ఆయన విమర్శలు చేసే అవకాశం ఉన్నా.. వ్యాపార లావాదేవీల కారణంగా.. మౌనంగా ఉంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సేఫ్‌గా ఉండడం గమనార్హం.

Shakir Babji Shaik
Editor | Amaravathi