ANDHRAPRADESH:ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ ఏపీలో కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. రాజకీయంగా పట్టు బిగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. పెద్దల సభ సీట్ల విషయంలో బీజేపీ మాటే చెల్లుబాటు అవుతోంది. ఇక, ఇప్పుడు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి మాజీ ప్రధానికి కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. మిగిలిన మూడు స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేనకు దక్కే అవకాశం ఉంది. ఈ రేసులో మూడు పార్టీల నుంచి ముఖ్య నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి.
రాజ్యసభలో ఖాళీలు
కేంద్రంలో - ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాజకీయంగా ఆసక్తి కర సమీకరణా లు తెర మీదకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026 లో ఎన్నిక లు జరుగనున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారిలో మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (కర్ణాటక), కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జార్జి కురియన్ (మధ్యప్రదేశ్), కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్), జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ (జార్ఖండ్), కాంగ్రెస్ నేత శక్తిసింగ్ గోహిల్ (గుజరాత్), వైసీపీ ఎంపీలు పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీశ్ ఉన్నారు.
కీలక నేతలకు కేంద్రంగా
తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్‌ఎస్ కు చెందిన కేఆర్ సురేశ్‌రెడ్డి కూడా రిటైర్ కానున్నారు. వీరిలో సింఘ్వీకి తిరిగి అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేఆర్ సురేశ్ రెడ్డి స్థానంలో పదవీ విరమణ చేయనున్న మల్లిఖార్జున ఖర్గే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక.. మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీలు.. పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ను పరిగణలోకి తీసుకునే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభకు బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా ఏపీ నుంచి మాత్రం బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా అభ్యర్ధుల ఖరారు కానున్నారు.
ఏపీ నుంచి మాజీ పీఎం- సీఎం
ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒక స్థానం మాజీ ప్రధాని దేవెగౌడ కు కేటాయించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్ కు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దేవెగౌడ - చంద్రబాబు మధ్య దశాబ్దాల కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. అదే విధంగా మరో మూడు స్థానాల్లో బీజపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఈ సారి ఖాయమని చెబుతున్నారు. టీడీపీ నుంచి సానా సతీశ్ కు మరోసారి అవకాశం దక్కనుందని సమాచారం. జనసేన నుంచి పారిశ్రామిక వేత్త లింగమేనని రమేశ్ కు ఇప్పటికే హామీ దక్కిందని చెబుతున్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు ఈ ఎంపికలో కీలకంగా మారాయి. ఇంకా సమయం ఉండటంతో.. చివరి నిమిషంలో మార్పులు చేర్పు లు జరిగితే.. మినహా ఏపీ నుంచి ఈ నలుగురు రాజ్యసభకు వెళ్లటం ఖాయమని సమాచారం.

Shakir Babji Shaik
Editor | Amaravathi