కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ నేతలు ఈ రోజు నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్ణయించారు. ఇందు కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే రాము మద్దతు దారులు భారీగా ఏర్పాట్లు చేసారు. అదే సమయంలో కే కన్వెన్షన్ లో వైసీపీ నేతలు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో మరో కార్యక్రమం ఏర్పాటు చేసారు. అయితే, వైసీపీ నేతలు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అందులో కుప్పంలో టీడీపీ గెలిస్తే తాను చంద్రబాబు బూట్లు తుడుస్తానని నాడు కొడాలి నాని చేసిన సవాల్ నిలబెట్టుకోవాలనే డిమాండ్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పైన వైసీపీ నేతలు ఆగ్రహం తో ఉన్నారు. రెండు పార్టీల శ్రేణులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాగా, మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. పేర్ని నాని ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక.. గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో గుడివాడలో ఈ రెండు పార్టీల సమావేశాల వేళ ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా పోలీసులు పెద్ద సంఖ్య లో మొహరించారు. ఇప్పటికే రెండు పార్టీల శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రెండు పార్టీల సమావేశాలు పూర్తయ్యే వరకు బందోబస్తు కొనసాగించనున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi