'ది కేరళ స్టోరీ'లో నిజాలు ఎన్ని?

 


గమనిక: 'ది కేరళ స్టోరీ' రివ్యూలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచి వేయొచ్చు.

విడుదలకు ముందే వివాదస్పద చిత్రంగా వార్తల్లో నిలిచింది ‘ది కేరళ స్టోరీ’విడుదలకు ముందే వివాదస్పద చిత్రంగా వార్తల్లో నిలిచింది ‘ది కేరళ స్టోరీ’ కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమయ్యారని, వారంతా ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద కార్యకలాపాల కోసం పని చేస్తున్నారన్న కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ సమయంలోనే పెద్ద వివాదం మొదలైంది.

ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ఈ చిత్రం విడుదలకు న్యాయస్థానాలు పచ్చజెండా ఊపాయి.

ఇంతకూ ‘కేరళ స్టోరీ’లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి?
అవి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచాయి?
దర్శకుడు సుదీప్తో సేన్‌ ‘ది కేరళ స్టోరీ’ని ఎలా తెరకెక్కించారు?


బాధిత కుటుంబాల మాట
షాలిని ఉన్నికృష్ణన్(అదా శర్మ ) మతం మార్చుకొని ఫాతిమాగా ఎలా మారింది? చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందనేది కథ.

నిజజీవిత సంఘటనలు ఆధారంగా ఈ కథను తెరకెక్కించామని దర్శకుడు సుదీప్తో సేన్‌ చెప్పారు.
చివర్లో బాధిత కుటుంబాలు మాట్లాడే వీడియో కూడా చూపించారు.


ఇలా మతం మార్చుకొని కనిపించకుండాపోయిన అమాయకులైన అమ్మాయిలందరికీ ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లుగా కూడా టైటిల్స్ వేశారు.

‘ది కేరళ స్టోరీ’ కథ కోసం ఏడేళ్ల పాటు పరిశోధన చేసినట్లు చెప్పారు దర్శకుడు.

ముగ్గురు అమ్మాయిల కథ
‘32 వేల మంది’ బాధితులు ఉన్నారని చెప్పి ట్రైలర్‌తో వివాదాన్ని పెంచారు కానీ, ఈ సినిమాను ముగ్గురు బాధిత అమ్మాయిల కథగా చూపించారు.

కేరళలోని ముగ్గురు నర్సింగ్ విద్యార్థినుల జీవితం ఇందులో కనిపిస్తుంది.

అమాయక ముస్లిమేతర అమ్మాయిలను ఇస్లామిక్ స్టేట్ కోసం ఎలా రిక్రూట్ చేశారు, ప్రపంచాన్ని తమ దేవుడే కాపాడతాడని ఒక తీవ్రవాద ముఠా ఆ ముగ్గురిని ఎలా బ్రెయిన్ వాష్ చేసింది, అమ్మాయిలు ఆ ట్రాప్‌లో ఎలా చిక్కుకున్నారనేది దర్శకుడు చూపించారు.

తన దగ్గర ఉన్న సమాచారం మేరకే దర్శకుడు ఈ కథకు తెర రూపం ఇచ్చారనే అనుకున్నా తెరపై కథ చూస్తున్నపుడు అది ఏదైనా సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలి. పాత్రలను ప్రేక్షులు ఫాలో కాగలగాలి. ఈ విషయంలో దర్శకుడు పెద్దగా కసరత్తు చేయలేదు.
షాలిని అఫ్గాన్ జైల్లో తన కథను చెబుతూ ఉంటుంది.

భూతకాలంలో, వర్తమానంలో కథ నడుస్తుంది. అయితే అమ్మాయిలను ట్రాప్ చేసే క్రమాన్ని మరీ సాగదీశారు దర్శకుడు.

మతాలు, దేవుళ్లు, నమ్మకాల చుట్టూ డైలాగులు రాసుకుంటూ చాలా రిపీట్ సీన్లు చూపించారు. చాలా చోట్ల దర్శకుడిగా ఒక పక్షం తీసుకున్నారనే భావన కలుగుతుంది

మత సామరస్యానికి విఘాతం కలిగిందా ?
యదార్థ సంఘటనలు సినిమాగా తీయడంలో తప్పులేదు, అది దర్శకుడి స్వేచ్ఛ.

కానీ, ఈ కథలో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు, మాటలు, పాత్రలు ఉన్నాయి.

దర్శకుడు ఒక పక్షం తీసుకున్నారని చెప్పడానికి నిదర్శనం.. ముస్లిమేతర పాత్రలు తప్పితే అన్ని పాత్రలనూ నెగటివ్‌గా చూపించడం.

ప్రతి పాత్రలోనూ మోసం చేసే తత్వాన్ని చూపించారు.


సెన్సార్ ఎలా అంగీకరించిందో!
ఇందులో కొన్ని అభ్యంతరకరమైన, కలచివేసే సన్నివేశాలున్నాయి.

తల, కాళ్లు , చేతులు నరకడాలు.. మత్తు మందు ఇచ్చి ఓ అమ్మాయిపై చాలా మంది లైంగిక దాడికి పాల్పడటం, నగ్న వీడియోలు.. ఇవన్నీ చూస్తున్నపుడు అసలు ఇలాంటి వాటికి సెన్సార్ ఎలా అంగీకరించిందో అనిపిస్తుంది.
కొన్ని బలవంతపు సన్నివేశాలు
ఈ సినిమాలో కొన్ని బలవంతంగా ఇరికించేసిన సన్నివేశాలు కనిపిస్తాయి.

ఒక సన్నివేశంలో- షాలిని గర్భవతి అని తెలుస్తుంది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు ప్రియుడు.

మతం మార్చుకోవడానికి ఆమె సిద్ధమవుతుంది. పెళ్లికి సిద్ధపడుతున్న సమయంలో ప్రియుడు పరారైపోతాడు.

అప్పుడు ఓ మత పెద్ద.. నువ్వు మరో ఇస్లాం యువకుడిని పెళ్లి చేసుకొని సిరియా వెళ్ళిపోతే 'మా దేవుడు నీ తప్పులన్నీ మాఫీ చేస్తాడు' అని చెప్తాడు.

కాసేపు ఆలోచించి అసలు ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది షాలిని.

ఇది అంతగా కుదరలేదు.
మరో సన్నివేశంలో- ఓ ఇస్లాం యువకుడి చేతిలో మోసపోయిన అమ్మాయి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న తన తండ్రి దగ్గరకు వచ్చి.. "నువ్వు నీ సిద్దాంతాలు అంటూ తిరిగావు. ఇప్పుడు నా పరిస్థితి చూడు. కనీసం మన దేవుళ్ల గొప్పదనం గురించి చెప్పాల్సింది కదా ?" అని ప్రశ్నిస్తుంది.

ఆ ప్రశ్నకు బిక్క మొహం వేస్తాడు తండ్రి.

ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నపుడు కథతో సంబంధం లేకుండా ఇరికించినట్లుగా అనిపిస్తుంది.

అదా శర్మ అదరహో
కేరళ స్టోరీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అదా శర్మ నటన. ఆమె నటన సహజంగా ఉంది. ఆమెలో ఇంత మంచి నటి ఉందా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నపుడు.

ఉపదేశాలు , సందేశాలుగా సాగిపోతున్న ఈ కథలో ఇంపాక్ట్ తీసుకొచ్చింది అదా శర్మ నటన.

భయం, కోపం, అమాయకత్వం, ఆందోళన .. ఇలా ప్రతి ఉద్వేగం ఆమె కళ్ళల్లో చక్కగా పలికింది. ముఖ్యంగా హిందీని కేరళ స్టైల్ లో పలికిన తీరు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.

అషిఫా పాత్రలో కనిపించిన సోనియా బలానీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ.

మాట, చూపు, నడక .. ఇలా ప్రతిదానిలో నెగిటివిటీ పండించింది.

ఆమె బ్రెయిన్ వాష్ చేసే సన్నివేశాలు సహజంగా వచ్చాయి.

యోగిత, సిద్ది పాత్రలు కూడా మెప్పిస్తాయి.

తల్లిపాత్రలో కనిపించిన దేవదర్శిని నటన ఎమోషనల్‌గా ఉంటుంది.

సహజమైన లొకేషన్స్
ఈ కథను చిత్రీకరించడానికి దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ ప్రత్యేకమైన ప్రభావాన్ని తీసుకొచ్చాయి.

అఫ్గాన్, ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో తీసిన సన్నివేశాలు భయానకంగా ఉంటాయి.

కేరళ నేపథ్యంలో ఇలాంటి కథ చూపించడం కొత్తే.

వీరేశ్ శ్రీవాల్స, విశాఖ్ జ్యోతిల నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది.

నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

దర్శకుడు ఈ కథతో మెప్పించే సినిమాకు కావాల్సిన డ్రామాను, సినిమాటిక్ ఫీల్‌ను క్రియేట్ చేయలేకపోయారు. అయితే చర్చకు దారి తీసే వివాదస్పద చిత్రంగా దీనిని మలిచారు