పిన్నెల్లి ఈవీఎం ఎపిసోడ్ వెనుక ట్విస్ట్ లు-దాచేసిన ప్రిసైడింగ్ అధికారి ?


మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే 13న పోలింగ్ సందర్భంగా ఈవీఎం పగులగొడితే వారం రోజుల తర్వాత కానీ ఈ వ్యవహారం బయటికి రాలేదు. ఆ తర్వాత కూడా దాచేందుకు నానా ప్రయత్నాలు. చివరికి ఈసీ వెబ్ క్యామ్ ఫుటేజ్ లో బయటపడినా వెంటనే అప్రమత్తం కాలేదు. చివరికి తెలంగాణకు వెళ్లి మరీ గాలించి అరెస్టు చేసిన పరిస్ధితి. ఓ దశలో పిన్నెల్లిని దేశం దాటించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈసీ లుకౌట్ నోటీసు ఇచ్చి దాన్ని అడ్డుకుంది.


మే 13న పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో తమ ప్రతర్ధి పార్టీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయన్న సమాచారంతో ఈవీఎం ధ్వంసం చేసేందుకు వెళ్లారు. పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నా, సీసీ కెమెరాల నిఘా ఉన్నా అవేవీ పట్టించుకోకుండా పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో పాటు దూసుకెళ్లి సునాయాసంగా ఈవీఎం పగులకొట్టేశారు. అనంతరం వీవీ ప్యాట్ మెషిన్ ను కూడా విసిరేరారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతను నెట్టేసి వెళ్లిపోయారు.

ఆ తర్వాతే అసలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా అయితే ఇంత జరిగితే వెంటనే అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అరెస్టు చేయించాలి. జరిగిన ఘటనకు తానే సాక్షిగా మారాలి. కానీ అలా జరగలేదు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని రెండు రోజుల పాటు పోలీసులు కోరినా ప్రిసైడింగ్ అధికారి పట్టించుకోలేదు. చివరికి పాల్వాయి గేట్ వీఆర్వోతో మాట్లాడి పోలీసులు 15న ఫిర్యాదు తీసుకున్నారు. 

అయితే వీఆర్వో ఫిర్యాదులోనూ గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు ఎఫ్ఐఆర్ రాసి ఊరుకున్నారు. ఐపీసీ చట్టంలోని సెక్షన్ 448, పీపీడీఏ చట్టంలోని సెక్షన్ 3, ఐపీసీ 427 రెడ్ విత్ 34 కింద కేసులు పెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ నే పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇందులో వీఆర్వో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు చెప్పడంతో వెబ్ క్యాస్టింగ్ ఫుటేజ్ కావాలని ఈసీకి లేఖ రాశారు. ఈసీ ఈ వీడియో ఇవ్వడంతో పిన్నెల్లి అరాచకం ప్రపంచానికి తెలిసింది.

ఇదంతా ఊహించిన పిన్నెల్లి ముందుగా హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. విషయం తెలిసి ఈసీ లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఎయిర్ పోర్ట్ లను అలర్ట్ చేసింది. చివరికి ఇస్నాపూర్ వద్ద పిన్నెల్లి సోదరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ఏపీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పిన్నెల్లి కాల్ రికార్డు పరిశీలించిన పోలీసులు.. సజ్జల రామకృష్ణారెడ్డి పీఏతో వేర్వేరు నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు.

మరోవైపు పిన్నెల్లికి తెలంగాణా కాంగ్రెస్ కీలక నేత ఒకరు రక్షణ కల్పిస్తున్నట్లు కూడా గుర్తించారు. న్నెల్లిని దేశం దాటించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. కర్ణాటక లేదా కేరళ నుంచి దేశం దాటిపోయేలా ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్ధితుల్లో ఈసీ నుంచి వచ్చిన సీరియస్ నోటీసులతో పిన్నెల్లి సోదరుల్ని పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు.