శ్రీకాకుళం: ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పధకాలు వైకాపా నేతలకు వణుకు పుట్టిస్తోందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు. నగర పరిధిలోని బలగమెట్టు, ఆదివారంపేట ప్రాంతాల్లో రెడ్డి చిరంజీవులు, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రెడ్డి శివన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన శ్రేణులతో కలసి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలు, ఉమ్మడి మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ, అయిదేళ్లు నిరంకుశంగా పాలించిన పాపానికి ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం, కూటమి ఆదరణ పెరుగుతూ వస్తుండడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అందువల్లనే సూపర్ సిక్స్, మేనిఫెస్టోపై అసత్య ప్రచారాలకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి సహా ఆ పార్టీ నేతలు ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించామని, ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో చిత్తశుద్ధితో ఆమలు చేస్తామని వెల్లడించారు. అయిదేళ్లలో ఆమదాలవలస రోడ్డు పూర్తి చేయలేని నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి యువ నాయకులుగా రామ్మోహన్ నాయుడు, తాను కృషి చేస్తామని చెప్పారు. నగరంలో సమస్యలు పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించి సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.
కూటమిని ఆశీర్వదించి ఎంపీగా రామ్మోహన్ నాయుడును, ఎమ్మెల్యే గా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలగ టీడీపీ నాయకులు చిట్టి నాగభూషణం, రెడ్డి గిరిజాశంకర్, అక్కిన రాజారావు, చిట్టి రాము, మజ్జి జగన్. బాన్న బద్రి, చిట్టి నాగేశ్వరరావు, ముకళ్ళ సింహాద్రి నాయుడు, కె. వి. ఎస్. నాయుడు (బుజ్జి),రొక్కం భాస్కర్, రౌతు సంతోష్,రెడ్డి శివ, రమణమూర్తి, వివిధ డివిజన్ల ఇంచార్జిలు, టీడీపీ, జనసేన. బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.