ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఆసక్తికర పోరు సాగుతోంది. ఇది గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా.. ఆసక్తిగానే ఉంది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేయడం తో అందరి దృష్టీ ఆకర్షించింది. ఇప్పుడు ఆయన పోటీ చేయకపోయినా.. కూడా అంతే హాట్‌గా కనిపిస్తోం ది. దీనికి కారణం.. పోటీలో ఉన్న మూడు కీలక పార్టీల అభ్యర్థులు కూడా.. కాంగ్రెస్ నాయకులే!
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే.. వారిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావడం గమనార్హం. అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ నేత. అంతేకాదు.. 2004లో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి సారి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అప్పట్లో వైఎస్‌కు అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో ఆయన వైసీపీలో చేరారు. 2019లో ఆయన వైసీపీ టికెట్‌పై పోటీ చేసి.. పవన్‌ను ఓడించారు.
ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జనసేన నేత.. పులవర్తి రామాంజనేయులు.. ఉరఫ్ నాని కూడా.. గతంలో ఈయన కూడా కాంగ్రెస్ నేతే. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరంలో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ బాట పట్టారు. ఆ ఎన్నికల్లో అంటే 2014లో పులవర్తి.. విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం జనసేన నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అంకెం సీతారాం అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే. అయితే.. ముగ్గురూ కూడా.. కాంగ్రెస్ జీన్ కావడం.. పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. భీమవరంలో పులవర్తి బలమైన నాయకుడు కావడం కలిసి వస్తున్న విషయం. ఇక, గ్రంధి కూడా.. సిట్టింగ్ నేత కావడంతో ఆయన కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. మరిఎవరు గెలుస్తారనేది చూడాలి.