మద్యంపై బాబు సంచలనం... ప్రస్తుతానికి సీఐడీ, అవసరమైతే ఈడీ!


గత ప్రభుత్వ హయాంలోని మద్యం పాలసీలపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. క్వాలిటీ లేని మద్యం అని ఒకరంటే.. ఏమాత్రం పరిచయం లేని బ్రాండ్లు అని మరికొంతమంది కామెంట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ పెర్ఫార్మెన్స్, తదనంతర పరిణామాల సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏపీ సీఐడీకి ఓ పని అప్పగించారు బాబు! ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 


ఇక మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్ లేకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని.. మరీ లోతైన విచారణ అవసరమనుకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సిఫార్సు చేస్తామని అన్నారు. అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఈ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. ఆ సమయంలో... మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయని.. ఇక నేరస్థుడే సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశామని.. తాము విడుదల చేస్తోన్న శ్వేత పత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. "ప్రజలకు హామీ ఇచ్చామంటే అది అమలు చేసేదిగా ఉండాలి" అని నొక్కి చెప్పిన చంద్రబాబు.. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెబుతూ ధరలు విపరీతంగా పెంచారు.. అయినప్పటికి మద్యం వినియోగం పెరిగిందే తప్ప తగ్గలేదని బాబు స్పష్టం చేశారు. 

ఏపీలో లిక్కర్ ఆదాయం తగ్గడం గమనార్హం అని తెలిపారు! ప్రధానంగా దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరకకపోవడానికి కారణం... ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారని.. చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారని.. అనంతరం లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారని బాబు అన్నారు. ఆ ఫలితంగా... ప్రభుత్వం ఏమి అమ్మితే అవే తాగే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, సరైన పాలసీలు తీసుకురావాలని, పేదలకు అందుబాటు ధరల్లో మద్యం లభించే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల సలహలూ సూచనలు స్వీకరిస్తామని సీఎం స్పష్టం చేశారు.