జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి... పవన్ కీలక ఆదేశాలు!


తజాగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్ పై దాడి వ్యవహారం కలకలం రేపింది. ఎమ్మెల్యే కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఇలా తన పార్టీ ఎమ్మెల్యే వాహనంపై దాడి జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు.


సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుమిల్లి ఎమ్మెల్యే బాలరాజు బయలుదేరారు. నాలుగు కూడలి దగ్గరకు ఆ వాహనం రాగానే కొంతమంది గుర్తుతెల్లియని వ్యక్తులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆ కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తన వాహనంపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే బాలరాజు స్పందించారు.

ఇందులో భాగంగా... ఆ రాళ్లదాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని, తాను సురక్షితంగానే ఉన్నట్లు బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.

ఇక బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హానీ జరగలేదని అన్నారు. ఈ దాడికి కారణమైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.