ANDRAPRADESH, AMARAVATHI: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నేషనల్ హైవేలతో కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది ప్రభుత్వం. అమరావతికి త్వరగా చేరుకునేలా బైపాస్‌లను రాజధాని రోడ్లను అనుసంధానం చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి కనెక్టివిటీకి కీలకమైన విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో బైపాస్ పాక్షికంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో అధికారులు, పోలీసులు పశ్చిమ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకల్ని అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో వచ్చి.. ఏలూరువైపు వెళ్లే వాహనాలను బైపాస్ మీదకు మళ్లించారు.
సంక్రాంతి సమయంలో రద్దీని గమనించి హైదరాబాద్ విజయవాడ హైవేలో వచ్చిన వాహనాలు.. విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా ఏలూరు వైపునకు మళ్లించారు. అయితే ఏప్రిల్ నాటికి గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా రాజధానివైపు 7 కి.మీ. మేర రాకపోకలను అనుమతించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి అమరావతికి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.. దగ్గర దారిగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు నేషనల్ హైవే 16 కోల్‌కతా-చెన్నైలో.. చిన్నఅవుటపల్లి-గొల్లపూడి-కాజ మధ్య విజయవాడ పశ్చిమబైపాస్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హైవేలో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలో మీటర్లు దాదాపు పూర్తికాగా.. మూడుచోట్ల హైటెన్షన్ విద్యుత్ తీగల మార్చే పనులు పెండింగ్ ఉన్నాయి. గొల్లపూడి-కాజ సెక్షన్‌లో 7 కిలో మీటర్లు పాకిక్షంగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నారు.
'విజయవాడ-హైదరాబాద్ హైవే, కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్‌ప్లాజా దాటిన తర్వాత ఇ-8 (పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం) రోడ్‌లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తి చేస్తాం'అని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు 3 కిలోమీటర్లకు పైగా బ్రిడ్జి, మరో 4 కిలో మీటర్లు మేర ఆరు లైన్ల రోడ్డును కూడా అందుబాటులోకి రానుంది. అప్పుడు హైదరాబాద్ హైవే, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి వాహనాలు అమరావతికి రాకపోకలు కొనాసగించేందుకు దగ్గర దారి అవుతుంది.
'రాజధానికి సంబంధించి.. ఇప్పుడు గొల్లపూడి, స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజి, కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్‌లోకి రాకపోకలు జరుగుతున్నాయి'అంటున్నారు అధికారులు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై బ్రిడ్జి మీదుగా ప్రయాణించి ఇ-8 రోడ్‌లోకి వెళ్లొచ్చు.. అప్పుడు దాదాపు 10 కి.మీ. దూరం తగ్గుతుంది అని చెబుతున్నారు. ఏప్రిల్ నెల నాటికి గొల్లపూడి-కాజ మధ్య 17.88 కిలో మీటర్ల మేర ఆరు లైన్ల హైవే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఐదు గ్రిడ్ రోడ్ల దగ్గర ఫ్లై ఓవర్లు లేకుండా బైపాస్ నిర్మిస్తుండగా.. కూటమి ప్రభుత్వం మాత్రం గ్రిడ్ రోడ్ల దగ్గర బైపాస్‌లో ఫ్లై ఓవర్ నిర్మించే పనులు చేపట్టనుంది. ఈ పనులు ఆలస్యం అవుతాయి.. అందుకే ఈలోపు పాక్షికంగా కొంతభాగం బైపాస్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.