ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో జనంలోకి వెళ్లి వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అయినా ఆయన వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ఎల్లుండి నెల్లూరు పర్యటనకు సిద్దమయ్యారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ ములాఖత్ లో కలుసుకోనున్నారు.
జూలై 3న నెల్లూరు వెళ్లి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు సిద్దమైన జగన్ కు తాజాగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో జగన్ పర్యటనకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు కండిషన్ పెట్టారు. ఇందుకు ఒప్పుకుంటేనే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చిచెప్పేస్తున్నారు. దీంతో జగన్ గతంలోలా ఏదో విధంగా అనుమతి తీసుకుని ఆ తర్వాత బల ప్రదర్శన చేస్తారా, అలా చేయకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది
జగన్ నెల్లూరు టూర్ పై పోలీసులకు 10 రోజుల ముందే సమాచారం ఇచ్చినట్లు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. జగన్ పర్యటన సాగే సమయంలో ఆయన తిరిగే ప్రాంతంలో రెండున్నర కిలోమీటర్ల దూరంలో భద్రత అవసరమని గుర్తించినట్లు అనిల్ తెలిపారు. అయితే పోలీసులు ఇప్పటివరకూ జగన్ నెల్లూరు టూర్ కు అనుమతి ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. పరిమిషన్ ఇస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదన్నారు. జగన్ పర్యటన ఆపేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జగన్ పర్యటన పై ఎందుకు అంత భయమని అనిల్ పోలీసుల్ని ప్రశ్నించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని ప్రాంతం ఎంచుకున్నామని, అధికారులు ఒక ప్రాంతం చూపించారని, అయినా మూడు రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3వ తేదీ జగన్ రావడం తథ్యమన్నారు. మాకు ఏ మార్గాల్లో రావాలో తెలుసన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నెల్లూరులలో జగన్ పర్యటన ప్రభంజనం చూడబోతున్నారన్నారు. స్థలాలు దొరక్క పాట్లు పడలేదని, కన్వీనెంట్ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇప్పటికే జగన్ నెల్లూరు టూర్ లో హెలికాఫ్టర్ దిగేందుకు హెలిప్యాడ్ కోసం తగిన స్థలాల్ని వైసీపీ నేతలు వెతుకుతున్నారు. అయితే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ హెలిప్యాడ్ కు స్థానికులు తమ స్థలాలు ఇవ్వకుండా ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ హెలిప్యాడ్ స్థలం ఖరారు కాలేదని తెలుస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi