హైదరాబాద్‌ ఉమ్మడి కోటా కింద ఏపీ నుంచి నీటి వాటా?


ANDHRAPRADESH:కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యత, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్పు వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వ అనుసరిస్తోన్న విధానాల గురించి విడమరిచి చెప్పారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టబోమని, ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు రేవంత్. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదిరించి ప్రజలకు అండగా నిలబడుతామని అన్నారు. తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా, గొప్పగా నిలిచిపోయే విధంగా తమ విధానం ఉంటుందని, ప్రజల హక్కులను తాకట్టు పెట్టబోమనీ చెప్పారు.

ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడినా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడుతం. కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో ఎవ్వరూ అధైర్య పడొద్దు.." అని రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.

కృష్ణా, గోదావరి నదీ జలాలు: వినియోగం- వివాదాలు అంశంపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్‌ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా జలాలపై గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యత, దాన్ని తర్వాత క్రమంలో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు స్థల మార్పు, తదనంతర పరిణామాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో ప్రజెంటేషన్ రూపంలో సమగ్రంగా వివరించారు.

మేడిగడ్డలో నీటిని నిలువ చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలోని అంశాలను విడమరిచి చెప్పారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై పాలసీ డాక్యుమెంట్‌ను సభ ముందు అందజేస్తామని తెలిపారు. స్పీకర్ అనుమతితో నీటి పారుదల రంగ నిపుణులు, న్యాయ శాఖ నిపుణులు, స్టేక్ హోల్డర్స్ అందరినీ ఆహ్వానించి ఒక మంచి సానుకూల వాతావరణంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణ శాశ్వత హక్కులను కాపాడుకోవడం కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు వాస్తవాలు చేరవేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.

వరద జలాలను వినియోగించుకుంటామని ఏపీ వాదనను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ముందు నికర జలాల్లో వాటా తేలాల్సిన అవసరం ఉందని అన్నారు. నికర జలాల్లో వాటా తేలిన తర్వాత మిగులు, వరద జలాల్లో ప్రొరేటా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలని చెప్పారు.

నీటి వాటాలో తెలంగాణ హక్కుల కోసం సంబంధిత సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ముందు వాదనలు వినిపించడమే కాకుండా న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. ఈ విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి స్వయంగా సమన్వయం చేస్తున్నారు.. అని రేవంత్ రెడ్డి వివరించారు

తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నీటి వాటాలో రాష్ట్ర హక్కులు దక్కేవని, హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు కూడా నివసిస్తున్న నేపథ్యంలో నగరానికి ఉమ్మడి కోటా కింద నీటి వాటా కోరి ఉంటే ఈ రోజు పరిస్థితి కొంత భిన్నంగా ఉండేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకంగా తక్కువ ధరకు లభించే విద్యుత్ విషయంలోనూ అన్యాయం జరిగిందని చెప్పారు.

గతంలో వైఎస్ జగన్‌ను పిలిచి సలహాలు ఇచ్చి, జీవోలు వచ్చేలా కేసీఆర్ సహకరించారని రేవంత్ ఆరోపించారు. వారిద్దరి మధ్య ఏముందనేది తమకు అనవసరమని వ్యాఖ్యానించారు. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు.

కృష్ణాలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసిపట్టాల్సింది పోయి, రాయలసీమ నీటి దారి దోపిడీకి కేసీఆర్ సహకరించాలని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల మెప్పు కోసం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మౌనంగా ఉండకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని, నీటిపారుదల శాఖకు కేసీఆర్ కుటుంబంలోని వారే మంత్రులుగా కొనసాగారని విమర్శించారు. నీటి కేటాయింపుల వివాదాలపై వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా సభలో చర్చిద్దామని సవాల్ చేశారు.

బేసిన్లు, బేషజాలు లేవంటూ ఆంధ్రావాళ్లను నీళ్లు తీసుకుపొమ్మని కేసీఆర్ గతంలో చెప్పారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తికి నీటి కేటాయింపులను పూర్తి చేయలేదని, భీమా, నెట్టెంపాడు, నల్గొండకు గ్రావిటీతో తీసుకెళ్లే ఎస్ఎల్ బీసీ పూర్తి కాలేదని అన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయని కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై 2007-08 లో ప్రాణిహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని, అంచనాలను, పేరును మార్చడమే కాకుండా బేసిన్ల సాకుతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టును తొలగించడం వల్ల నష్టం జరిగిందని రేవంత్ చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 54 లక్షల ఎకరాలకు నీరిస్తే, ఎకరాకు 93 వేల రూపాయలు ఖర్చయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 15 లక్షల ఎకరాలకు నీరు ఇస్తే, ఎకరాకు 11.47 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now