తీన్మార్ మల్లన్నపై కవిత ఓ రకంగా పోరాటమే చేశారు. బయటకు వచ్చారు. మీడియా ముందు కూడా మాట్లాడారు.
HYDERABAD:బీఆర్ ఎస్ పార్టీలో ఉండాలా? వద్దా?'-ఇదే అజెండాతో సోమవారం అర్ధరాత్రి ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే.. కేసీఆర్ మనుషులతో ఓ హోటల్‌లో చర్చలు జరి పినట్టు తెలిసింది. ఈ భేటీపై అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కవిత చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని.. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిన తర్వాత తనకు మద్దతుగా పార్టీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో `తెలంగాణ జాగృతి`కి చెందిన ఇద్దరు, కేసీఆర్‌కు మద్దతుగా ఉంటూ.. ఇరు శిబిరాల్లోనూ సానుకూలత దక్కించుకున్న ఓ నాయకుడితోనూ ఆమె అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు చర్చలు జరిపినట్టు తెలిసింది. సుదీర్ఘంగా మూడు గంటల పాటు.. జరిగిన ఈ చర్చల్లో కవిత భర్త అనిల్ సహా ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని సమాచారం. పార్టీలో ఉండడమా.. బయటకు రావడమా? అనే విషయంపైనే ఈ చర్చ సాగినట్టు తెలిసింది.
ఇటీవల జరిగిన రెండు మూడు పరిణామాలను ఈ సందర్భంగా అనిల్ ప్రస్తావించి.. కేసీఆర్ నుంచి మద్ద తు కొరవడినా.. ప్రజల్లో సింపతీ పెరుగుతోందని.. కవిత వస్తే.. బాగానే స్పందన ఉంటోందని కూడా అనిల్ చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా కవితకు ఓ వర్గం మీడియా అండగా ఉందని ఆయన చెబుతున్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వర్గాలు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని వారు కూడా.. కవితవైపు ఉన్నట్టు తెలిపారని సమాచారం. ఈ క్రమంలో బయటకు వచ్చే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బెటర్ అని కూడా అనిల్ చెప్పినట్టు తెలిసింది.
తీన్మార్ మల్లన్నపై కవిత ఓ రకంగా పోరాటమే చేశారు. బయటకు వచ్చారు. మీడియా ముందు కూడా మాట్లాడారు. కంచం-మంచం అంటూ.. చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.అయితే.. పార్టీ నుంచి మాత్రం తనకు సంపూర్ణ మద్దతు లభించలేదని.. ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు మద్దతుగా మాట్లాడలేదని ఆమె చెబుతున్నారు. ఇది కూడా వాస్తవమే. జగదీశ్వర్‌రెడ్డి విషయంలో స్పందించినట్టుగా.. కవిత విషయంలో ఎవరూ స్పందించలేదు. ఇక, తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. దీనిపై రేపో మాపో మరోసారి భేటీ అయి.. స్థానిక ఎన్నికలకు ముందే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.