రెండు కిడ్నీలు చెడిపోవడంతో విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి
ప్రభాస్ రూ.50 లక్షల సాయం చేశారన్న వార్తలను ఖండించిన భార్య సువర్ణ
కిడ్నీ మార్పిడికి భారీగా ఖర్చవుతుందని, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి
నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వెంకట్
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
BOTH STATES:ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయనకు అగ్ర నటుడు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెంకట్ భార్య సువర్ణ స్పష్టం చేశారు.
గత వారం రోజులుగా ఫిష్ వెంకట్‌కు హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్‌బీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని, డయాలసిస్‌తో వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవాలంటే తక్షణమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, అందుకు దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని వారు స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ భార్య సువర్ణ మాట్లాడుతూ.. "ప్రభాస్ గారు ఆర్థిక సాయం చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం. బహుశా మా కష్టం గురించి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. విషయం తెలిస్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారనే నమ్మకం ఉంది. మాకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు భరించే స్తోమత లేదు. కిడ్నీ దానం చేస్తామని కొందరు వస్తున్నా, వారు కూడా డబ్బులు అడుగుతున్నారు. దయచేసి సినీ పెద్దలు, దాతలు స్పందించి మాకు అండగా నిలవాలి. నా భర్తను బతికించి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి" అని ఆమె ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వెంకట్ ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉందని, ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi