చంద్రబాబును జనం ఎందుకు కలవట్లేదంటే- జగన్ చెప్పిన కారణం


ANDHRAPRADESH:రాష్ట్రంలో ప్రస్తుతం భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయని, రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రమేనని వైఎస్ జగన్ తెలిపారు. రైతుకు, అక్కచెల్లెళ్లకు, నిరుద్యోగులకు, విద్యార్ధులకు, ఉద్యోగులకు.. ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందిస్తున్న పార్టీ వైసీపీయే అన్నారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత వైసీపీకి ఉందన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజలకు అండగా నిలబడింది వైసీపీయే అన్నారు. ఇప్పటికే తాము ప్రజల కోసం ఎన్నో నిరసనలు చేపట్టామన్నారు.

రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో పేరుతో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలు అవగాహన తెచ్చుకుని నేరుగా నిలదీసేలా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబును కలిస్తే సమస్యలు తీరవని తెలిసే ఆయన్ను ఎవరూ కలవడం లేదన్నారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎగిరిపోతుందని, తిరిగి వైసీపీయే వస్తుందని తెలిసి తమను కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేక విపక్షాన్ని అణచివేయాలని చూస్తున్నారన్నారు.

చంద్రబాబు మాటను అధికారులు కూడా వినడం లేదని, అందుకే డీజీ స్ధాయి అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారిని అరెస్టు చేశారని, అలాగే సంజయ్, పీవీ సునీల్, కాంతిరాణా టాాటా వంటి వారిని తప్పుడు కేసులు పెట్టి సస్పెన్షన్లు చేశారన్నారు. తప్పుడు కేసులతో వీరిని వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇంకా చాలా మంది అధికారులను పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. తమకు అనుకూలమైన అధికారుల్ని పెట్టుకుని విపక్షాల్ని వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గాల్లో వీరి అండతో ఇసుక, మట్టి మాఫియాలు, పేకాట క్లబ్ లు వంటి వాటిని నడుపుతున్నారన్నారు. డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు సేకరించి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారన్నారు.

ఇవన్నీ భరించలేకే సిద్ధార్ధ్ కౌశల్ వంటి అధికారులు వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారని జగన్ ఆరోపించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అధికారులకు ఎన్వోసీలు ఇవ్వకపోవడం వల్లే ఇలా వీఆర్ఎస్ లు తీసుకుని వెళ్లిపోతున్నారన్నారు. చంద్రబాబు వేధింపుల వల్లే ఇలా అధికారులు వెళ్లిపోతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబుకు ఓ రాజకీయ పార్టీకి ఉండే మౌలిక హక్కులు ఏంటో తెలియదా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ రాజకీయాలు ఎలా చేశారని అడిగారు. ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యవంతుల్ని చేయడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు కాదా అని అడిగారు. ప్రభుత్వం వల్ల నష్టం జరిగితే దాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని నిలదీశారు.

గుడివాడలో స్ధానిక జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్ కూడా అయిన బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ సైకోలు కర్రలు, రాడ్లతో దాడులు చేశారని జగన్ ఆరోపించారు. ఆమె చేసిన తప్పేంటని జగన్ ప్రశ్నించారు. ఎందుకు ఆమెపై దాడి చేశారని, దుర్భాషలు ఆడారని, అనరాని మాటలు అన్నారని అడిగారు. చంద్రబాబు చేసిన మోసాల్ని నిలదీస్తూ సూపర్ సిక్స్ లు ఏమయ్యాయని అడిగేందుకు వెళ్తుంటే తప్పేముందని ప్రశ్నించారు. గంటన్నరసేపు తిడుతూ, కొడుతూ కారు అద్దాల్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర పోషించారన్నారు.

చంద్రబాబు యాక్టింగ్ చూస్తే ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలని జగన్ సెటైర్లు వేశారు. కళ్లముందు హారిక కారుపై దాడి కనిపిస్తుంటే ఇప్పటివరకూ కారకులపై కేసులు పెట్టలేదని, దీనికి విరుద్దంగా హారిక భర్తపైనే కారు పెట్టారన్నారు. ప్రభుత్వ డ్రైవర్ నడుపుతున్న ప్రభుత్వ కారులో వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఉప్పాల రాముపై కేసు పెట్టారన్నారు. బీసీల గురించి మాట్లాడేందుకు వీరికి సిగ్గుండాలని, ఎక్కడైనా దూకి చావాలని సూచించారు.

మరుసటి రోజు పేర్ని నాని, కైలా అనిల్ సహా ఇతర వైసీపీ నేతలపై కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు క్యాడర్ మీటింగ్స్ పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మ్యానిఫెస్టో మోసంపై మీటింగ్ పెట్టుకుని క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా అని అడిగారు. దాడుల నుంచి పోలీసులు రక్షించడం మాని, వారి సమక్షంలో జరుగుతున్న దాడులకు ప్రేక్షకపాత్ర పోషిస్తూ బాధితులపై దగ్గరుండి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమేనా అని నిలదీశారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now