చంద్రబాబు మూడ్ ను బట్టే జడ్ ప్లస్ భద్రత..! జగన్ సంచలన ఆరోపణ...!


ANDHRAPRADESH:ఏపీలో ఏకైక విపక్ష పార్టీ అధినేతగా ఉన్న తనకు సీఎం చంద్రబాబు కల్పిస్తున్న భద్రతపై వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాను చేస్తున్న పర్యటనల్లో కొన్ని సార్లు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారని, మరికొన్ని సార్లు వదలేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాజాగా సత్తెనపల్లి, పొదిలి సహా తన పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మూడ్ ను బట్టే తనకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారన్నారు.

తన పర్యటనలు ముగిశాక చంద్రబాబు పోలీసుల్ని పిలిపించుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. మిర్చి ధరలు పడిపోతే ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్లానని, అదేమైనా తప్పా అని అడిగారు. అలా వెళ్లినందుకు పోలీసులు సహకరించొద్దని జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న తనకు భద్రత ఉపసంహరించుకున్నారన్నారు. చంద్రబాబుకు మూడ్ వచ్చిన్పపుడు తనకు భద్రత ఇస్తారని, లేకపోతే ఉపసంహరించుకుంటున్నారని విమర్శించారు.

రైతుల్ని మిర్చియార్డులో పరామర్శించినందుకు తనపైనే తిరిగి కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. ఏప్రిల్ 8న సత్యసాయి జిల్లా రామగిరిలో స్ధానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెెళ్లానని, హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత ఇవ్వలేదన్నారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, తిరిగి తనపైనే తప్పుడు ప్రచారం చేశారని, పైలట్లపైనా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించి విచారణ పేరుతో వేధించారన్నారు. రామగిరిలో తన పర్యటన తర్వాత వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీదా కేసులు పెట్టారన్నారు. తమ వాళ్లను టీడీపీ వాళ్లు చంపినా తాను వెళ్లి పరామర్శించకూడదంటున్నారన్నారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు.

జూన్ లో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు సంఘీభావంగా తాను పర్యటించానని, 40-50 వేల మంది ఈ కార్యక్రమానికి వచ్చారన్నారు. చంద్రబాబు 40 మందితో వీళ్లపై రాళ్లు వేయించి టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అక్కడ రైతులు సంయమనంతో వ్యవహరించారన్నారు. వాళ్లు ఈ 40-50 మందిపై పడితే బతికే వారా అని అడిగారు. అయినా తమపై మూడు కేసులు పెట్టారన్నారు. 15 మంది రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు.

ఆ తర్వాత పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబుపై వ్యతిరేకతతో వేల మంది వచ్చారన్నారు. చంద్రబాబు కార్యక్రమాలకు జనం వెళ్లకపోతే ఆ తప్పెవరిది అన్నారు. తన కార్యక్రమాలకు జనం వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. తన కార్యక్రమాలకు జనం రాకుండా సత్తెనపల్లిలో హౌస్ అరెెస్టులు, లాఠీ చార్జ్ లు చేస్తున్నారన్నారు. తన పర్యటనకు పోలీసులు భద్రత కల్పించలేదని, తన కార్యక్రమానికి ఎవరూ రాకుండా చూసుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఈ పర్యటన తర్వాత ఐదు కేసులు పెట్టారని, సినిమా డైలాగులు పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని జైలుకు పంపారన్నారు. మీకు ఆ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి సినిమాల్లో వాటిని తీయించేయాలన్నారు. సినిమాల్లో పాటలు, డైలాగ్స్ పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పేనా అని అడిగారు.

ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయకుండా సినిమా డైలాగ్స్ చెప్పిన వాళ్లను, పోస్టర్లు ప్రదర్శించిన వారిని రిమాండ్లకు పంపుతారా అని ప్రశ్నించారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఇది ఉందన్నారు. పోలీసు వేధింపుల వల్ల చనిపోయిన ఉప సర్పంచ్ ను బెట్టింగ్ కేసు పెట్టారన్నారు. చంద్రబాబు మానవత్వం మర్చి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారన్నారు. ధరల్లేక మామిడి రైతులు కష్టాలు పడుతుంటే జూలైలో తాను బంగారుపాళ్యం వెళ్లానని తెలిపారు. ఎంతమంది రైతులకు కేజీకి 12 రూపాయలు వచ్చాయని జగన్ ప్రశ్నించారు. కర్నాటకలో 16 రూపాయలు ఇస్తుంటే 12 రూపాయలు ఇస్తామంటున్నారని, అదీ కొంతమందికే అన్నారు.

బంగారుపాళ్యం పర్యటనలో 2 వేల మందికి నోటీసులు ఇచ్చారని జగన్ ఆరోపించారు. 2 వేల మంది పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఆపేందుకు ప్రయత్నించారన్నారు. వీళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన ప్రోగ్రాంకు ఎవరూ రాకుండా చూసుకునేందుకు, రైతుల్ని, ప్రజల్ని నిర్బంధించేందుకే అన్నారు. చివరికి పెట్రోల్ బంకులకూ నోటీసులు ఇచ్చారన్నారు. అయినా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారన్నారు. మామిడి పళ్లను రోడ్లపైకి పారబోశారన్నారు. అక్కడికి వెళ్లినందుకు ఐదు కేసులు పెట్టి 20 మందిని అరెస్టు చేసారన్నారు. రాష్ట్రంలో అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్దితి ఎవరికీ ఉండకూడదని చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారన్నారు.



WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now