ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 13 నెలల పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తు న్నారు. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయంలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సుగవాసి పార్టీ వీడారు. ఇప్పుడు అనంతపురంకు చెందిన మరో నేత పార్టీలో పరిణామాల పైన మనస్థాపంతో ఉన్నారు. ఆయన పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది.
2024 ఎన్నికల్లో కూటమి పొత్తు కారణంగా టీడీపీలో పలువురు సీనియర్లు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే, సొంత పార్టీలోనూ పలువురికి సీట్లు దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం అర్బన్ నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వైకుంఠం ప్రభాకర్ చౌదరికి 2024 లో సీటు దక్కలేదు. 2019 ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో.. 2024 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి స్థానంలో టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయం నుంచి పార్టీలో ప్రభాకర్ చౌదరి ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినా.. నియోజకవర్గంలో గుర్తింపు లేకపోవటం ఆయన మద్దతు దారులకు నచ్చటం లేదు. జేసీ వర్గం తో ప్రభాకర్ చౌదరి ఒక దశలో రాజకీయం గా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఎదుర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం పైన విధేయత చూపించిన ప్రభాకర్ చౌదరికి ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల తో మనస్థాపంతో ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రభాకర్ చౌదరి అనంతపురం మున్సిపల్ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కాగా, మారుతున్న రాజకీయ సమీకరణాలతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రభాకర్ చౌదరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి పార్టీ వీడుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సమయంలో ఆయన నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi