ANDHRAPRADESH;ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎట్టకేలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం బంగారుపాళ్యం చేరుకున్న జగన్ కు భారీ స్దాయిలో వైసీపీ కార్యకర్తలు, రైతులు, జనం స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మార్కెట్ యార్డ్ కు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి బ్లాక్ చేశారు. రాయలసీమలోని మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో జగన్ వారిని పరామర్శించేందుకు వచ్చారు.
ఇవాళ ఉదయం పులివెందుల నుంచి బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చేరుకున్న జగన్ ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పోలీసులు భారీ స్ధాయిలో ఆంక్షలు విధించి వారిని అడ్డుకున్నారు. ముఖ్యంగా బంగారు పాళ్యం మార్కెట్ యార్డ్ కు వెళ్లే దారులన్నీ బ్యారికేడ్లతో మూసేసారు. జగన్ పర్యటనకు వెళ్లే వాహనాలను, జనాన్ని లెక్కించి మరీ మార్కెట్ యార్డ్ వద్దకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాళ్యం చేరుకున్న జగన్ ను చూసేందుకు వారు ఆంక్షల్ని లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్లారు.
ఈ సందర్భంగా గాయపడిన పార్టీ కార్యకర్తను కలవడానికి తన కాన్వాయ్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన జగన్ ను బంగారుపాలెం సమీపంలో పోలీసు అధికారులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని తెలుసుకున్న వైఎస్ జగన్ .. తన వాహనం నుండి దిగడానికి ప్రయత్నించారు.
ఘర్షణలో గాయపడిన ఒక కార్యకర్తను స్వయంగా కలుసుకుని ఓదార్చాలని భావించారు. అయితే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని వైఎస్ జగన్ కాన్వాయ్ నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు.వైఎస్ జగన్ పట్టుబట్టినా .. ఎస్పీ గాయపడిన కార్యకర్తను కలవడానికి అనుమతించలేదు. చివరికి ఆయన కాన్వాయ్‌లోకి తిరిగి ప్రవేశించి తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi