ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాల పైన మంత్రాంగం సాగుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఇక భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు కేంద్ర కేబినెట్ లో బెర్తు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే, ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మంత్రివర్గ విస్తరణ
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల పైన కీలక మంత్రాంగం సాగుతోంది. ప్రధాని మోదీ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా.. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి రెండు మిత్రపక్ష పార్టీలు ఉండగా.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.
జనసేనకు ఛాన్స్
ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
సమీకరణాలే కీలకం
అయితే, జనసేన కు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచి.. కేంద్ర కేబినెట్ లో మరో స్థానం తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందనే చర్చ సాగుతోంది. అదే జరిగితే ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకా శం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుతో ఢిల్లీ పెద్ద లు కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం చర్చించే అవకాశం ఉంది. కాగా, చంద్రబాబు - పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలి.. తద్వారా ఏపీ కేబినెట్ లో నాగబాబు ఎంట్రీ.. మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi