వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
వేసవి సెలవులు ముగిసనప్పటికీ- ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి అందుతోన్న ఆదరణ, లభిస్తోన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోన్నారు అధికారులు. గతంలో చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన 26 ప్రత్యేక రైళ్లను పొడిగించిన విషయం తెలిసిందే
ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని అకోలా నుంచి తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రెండు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించారు. ఏకంగా వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ రైలు నడుస్తుంది.
ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07605 ఎక్స్ ప్రెస్.. రెండో రోజు ఉదయం 11:50 నిమిషాలకు అకోలాకు చేరుకుంటుంది.
ప్రతి ఆదివారం ఉదయం 8:10 నిమిషాలకు అకోలా నుంచి బయలుదేరే నంబర్ 07606 నంబర్ ఎక్స్ ప్రెస్ రెండో రోజు తెల్లవారు జామున 5:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్, కదిరి, ధర్మవరం జంక్షన్, అనంతపురం, కర్నూలు సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందెడ్, బస్మట్, వషీం మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi