కేంద్రం నిర్ణయం వేళ బనకచర్లపై చంద్రబాబు కీలక ప్రకటన..!!

ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పై మరోసారి స్పష్టత ఇచ్చారు. తన విధానం ఏంటో వివరించారు. ఈ ప్రాజెక్టు వలన ఎవరికీ నష్టం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లని తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ లోనూ అడ్డుకోనని తేల్చి చెప్పారు. తాజాగా కేంద్రం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల పైన కొర్రీలు విధించింది. ఇద్దరు సీఎంల భేటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్రం వద్దే తమ వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దం అయింది. దీంతో, చంద్రబాబు మరోసారి తన వైఖరి పైన ప్రకటన చేసారు.

జగన్ పై ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్య లు చేసారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ఆరోపించారు. తప్పుడు పనులు తాత్కాలికమని చెప్పారు. చేసిన పనులే శాశ్వతమని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహా లేకుండా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు.

వాళ్లతో రాజకీయాలు 

దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.పని చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లని తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు. మామిడి రైతులకు తాము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను తాము పరిష్కరిస్తామని.. రైతులకూ తమపై నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

ఆధునిక పద్దతులతో

వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా లాభాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని అన్నారు. మారిన ఆహారపు అలవా ట్లకు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు. సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక, బనక చర్ల ప్రాజెక్టు పైన ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించేందుకు చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది.

 

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now