కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటరును ప్రారంభించిన సీఎం చంద్రబాబు


టాటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోనే తొలి నెర్వ్ సెంటర్ ఏర్పాటు

ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్, నిరంతర పర్యవేక్షణ

ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, హెల్త్ సెంటర్ల అనుసంధానం

వర్చువల్ విధానంలోనూ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు

దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు విస్తరించాలని ప్రభుత్వ ప్రణాళిక

ANDHRAPRADESH:ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి, వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది.

ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్‌మెంట్‌లు, వ్యక్తిగత కౌన్సెలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది.

అలాగే అవసరమైన సందర్భాల్లో రోగులకు వర్చువల్ విధానంలోనే వైద్య నిపుణులతో మాట్లాడించి చికిత్స అందించే సౌకర్యం కూడా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను, ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఈ నెర్వ్ సెంటర్ ద్వారా అనుసంధానించుకునే అవకాశం కల్పించారు. స్క్రీనింగ్ టెస్టుల నుంచి చికిత్స అనంతర ఫాలో-అప్‌ల వరకు అన్ని సేవలు ఒకేచోట లభిస్తాయి.

ప్రస్తుతం మొదటి దశలో కుప్పంలో ప్రారంభమైన ఈ సేవలను, రెండో దశలో చిత్తూరు జిల్లా అంతటికీ, మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజారోగ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now